
రామాయంపేట, వెలుగు: రామాయంపేట మున్సిపల్ లో మంగళవారం కలెక్టర్ రాహుల్ రాజ్ పర్యటించారు. ఎల్ఆర్ఎస్ అమలు తీరు, తాగునీరు తదితర సమస్యలపై ఆరా తీశారు. అంతకుముందు స్థానిక మున్సిపల్ ఆఫీస్కు వెళ్లి, ఎల్ఆర్ఎస్ రికార్డులను పరిశీలించారు. అనంతరం పట్టణంలోని ఓ వెంచర్ లో రెగ్యులరైజ్కాని ప్లాట్లను చూశారు. అక్కడి నుంచి ఎస్సీ కాలనీలోకి వెళ్లి, తాగునీటి సమస్యపై ఉందా అని స్థానికులను అడిగి తెలుసుకున్నారు.
జిల్లాలో ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణకు 22 వేల దరఖాస్తులు వచ్చాయన్నారు. ఈ నెల 31లోపు చేయించుకుంటే 25 శాతం రాయితీ వర్తిస్తుందని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్లాట్ల యజమానులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే, జిల్లాలో 2 లక్షల ఎకరాల్లో వరి సాగవుతోందని, పంటలు ఎండి పోకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ దేవేందర్ తదితరులున్నారు.