రేగొండ,వెలుగు: చారిత్రక సంపదను పరిరక్షిస్తూ బావితరాలకు అందించాలని జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్ రాహుల్‌శర్మ పేర్కొన్నారు. ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని పాండవుల గుట్టలను జిల్లా ఏస్పీ కిరణ్‌ఖరేతో కలిసి కలెక్టర్ రాహుల్‌శర్మ సందర్శించారు. ఈసందర్భంగా పాండవులు అరణ్యవాసం చేసిన సమయంలో వేసిన పెయింటింగ్ లను పరిశీలించారు. అనంతరం రోప్ సహయంతో ఎత్తైన గుట్టలపై ట్రేక్కింగ్ చేపట్టారు. ఈసందర్భంగా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ పాండవుల గుట్టల వద్ద పర్యాటకులు రాత్రి బస చేసేందుకు కాటేజీల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పన చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.
పాండవుల గుట్టల పర్యటనకు ప్రత్యేక ప్యాకేజీలు రూపొందించి దేశ, విదేశాల నుంచి పర్యాటకులను ఆకర్షించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. చారిత్రక ప్రాశస్త్యం కలిగిన పాండవుల గుట్టలను టూరిస్ట్ ప్లేస్‌గా అభివృద్ధి చేయడానికి అవకాశం ఉందన్నారు. సహజ సిద్ధమైన గుట్టల అందాలను పరిరక్షించేందుకు పటిష్టమైన చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఆయన వెంట డీపీఆర్వో శ్రీనివాస్, ఆర్డీవో మంగిలాల్, డీఏస్పీ సంపత్‌రావు, భూపాలపల్లి సీఐ డి. నరేష్‌కుమార్‌గౌడ్, చిట్యాల సీఐ దగ్గు మల్లేష్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.