మహదేవపూర్, వెలుగు: జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ మంగళవారం తెలంగాణ స్టేట్ బార్డర్ మహదేవపూర్, కాటారం మండలాల్లో పర్యటించారు. కొత్తగా విధుల్లోకి చేరిన కలెక్టర్ మహదేవపూర్ మండలం కాళేశ్వరం ఆలయంలో పూజలు చేశారు. ఈవో మారుతి స్వామివారి శేష వస్త్రాలు అందించగా, అర్చకులు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం గోదావరి నదిపై తెలంగాణ-మహారాష్ట్ర బార్డర్ లోని బ్రిడ్జ్ ను పరిశీలించారు. చిన్న కాళేశ్వరం పనులను గురించి ఇరిగేషన్ ఆఫీసర్లతో సమీక్ష చేశారు. అనంతరం బీరసాగర వద్ద జరుగుతున్న చిన్న కాళేశ్వరం పంప్ హౌస్ మరమ్మతు పనులు పరిశీలించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. నెల రోజుల్లో పనులు పూర్తి చేయాలని ఈఈ యాదగిరిని ఆదేశించారు.
మండల కేంద్రంలోని ఎర్ర చెరువు, మందిరం చెరువులను పరిశీలించి, చెరువు అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. కాటారం మండలం గారేపల్లి వద్ద కాళేశ్వరం రెండో దశ ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించి, ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన భూసేకరణ, అవసరమైన నిధులు కోసం ప్రతిపాదనలు అందచేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎంపీడీసీ ఎంపీటీసీ మమతనాగరాజు, అధికారులు పాల్గొన్నారు.