జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: భూపాలపల్లి జిల్లా అభివద్ధిలో ముందంజ వేసిందని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. ఆదివారం అంబేద్కర్ క్రీడా మైదానంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఆయన జిల్లా ప్రగతిని వివరించారు. జిల్లాలో మహాలక్ష్మీ స్కీం ద్వారా 98.60 లక్షల మంది మహిళలు ప్రయాణం సాగించారని, రూ.2 లక్షల చొప్పున 37,235 మంది రైతులకు రూ.332 కోట్ల రుణమాఫీ జరిగిందని తెలిపారు. యాసంగిలో 79,544 మంది రైతులకు రూ.79.15 కోట్ల రైతు భరోసా డబ్బులు వారి బ్యాంకు ఖాతాల్లో జమచేయనున్నట్లుగా చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 200 యూనిట్ల లోపు కరెంట్ వినియోగించుకునే 54,131 మంది వినియోగదారులకు ఉచిత కరెంట్ అందిస్తున్నామన్నారు.
ఇప్పటి వరకు 1,741 మందికి రాజీవ్ ఆరోగ్య వైద్య సేవలు అందించగా రూ.6.19 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. జన ఔషధి ద్వారా 92,818 మందికి, తెలంగాణ డయాగ్నస్టిక్ హబ్ ద్వారా 96,870 మందికి వైద్య సేవలు అందించినట్లు తెలిపారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్, మహాదేవపూర్ లోని డయాలసిస్ కేంద్రాల ద్వారా 1,867 మందికి డయాలసిస్ సేవలు అందించామన్నారు. 72,118 మంది రైతులకు రైతుబీమా చేశామని, వారిలో మరణించిన 1,363 మంది రైతు కుటుంబాలకు రైతుబీమా ద్వారా రూ.68.15 కోట్ల ఆర్ధికసాయాన్ని అందించామన్నారు.
మహాలక్ష్మి పథకం ద్వారా 67,432 మంది లబ్ధిదారులకు రూ.500 లకే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, ఎస్పీ కిరణ్ ఖరే, రాష్ట్ర ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ ఐతా ప్రకాశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.