సీపీఆర్ పై అవగాహన ఉండాలి : కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి అర్బన్, వెలుగు: సీపీఆర్ ప్రక్రియపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జయశంకర్​భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. శనివారం ఐడీవోసీ ఆఫీస్ లో  ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో సీపీఆర్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని కలాం ఫొటోకు పూలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అత్యవసర పరిస్థితిల్లో సీపీఆర్ చేయడం ద్వారా ప్రాణాలు కాపాడేందుకు అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ అవగాహనతో ఉండాలన్నారు. 

బ్లాస్టింగ్​ల వల్ల ఇబ్బందులను గుర్తిస్తాం..

గుర్రంపేట ఎస్సీ కాలనీలో సింగరేణి బ్లాస్టింగ్​ల వల్ల ఏర్పడుతున్న ఇబ్బందులు పరిశీలనకు కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. శనివారం రెవెన్యూ, సింగరేణి అధికారులతో గుర్రంపల్లి సింగరేణి సంస్థ ఉపరితల ఘని వల్ల ఏర్పడుతున్న సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై మీటింగ్ నిర్వహించారు. 

ఆర్అండ్ బీ, వ్యవసాయ శాఖ, పంచాయతీ అధికారి, పరిశ్రమల శాఖ జీఎం, కాలుష్య నియంత్రణ మండలి, పర్యావరణ శాఖ, ఆర్డీవో, ఎంపీడీవోలతో కమిటీ ఏర్పాటు చేశామని, గ్రామంలో పర్యటించి 15 రోజుల్లో నివేదిక అందజేయాలని ఆదేశించారు. సమావేశంలో అడిషనల్​కలెక్టర్ వెంకటేశ్వర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.