ఎన్నికల విధులు సమర్థవంతంగా నిర్వహించాలి: రాజర్షి షా

ఎన్నికల విధులు సమర్థవంతంగా నిర్వహించాలి: రాజర్షి షా

మెదక్ టౌన్, వెలుగు: ఎన్నికల విధులు సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షి షా అధికారులకు సూచించారు. సోమవారం జిల్లాలోని పీవో, ఏపీవో,  పోలింగ్ సిబ్బందికి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్  మాట్లాడుతూ.. ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది ట్రైనింగ్ క్లాస్​లకు తప్పని సరిగా హాజరు కావాలన్నారు. పోలింగ్ డే రోజు పీవోలు తీసుకోవాల్సిన చర్యలు, బాధ్యతలపై క్లుప్తంగా వివరించారు.

మాక్ పోలింగ్ సందర్భంగా పాటించాల్సిన అంశాల గురించి వివరించారు.  ఓటరు జాబితాలో పేరు ఉంటేనే లోనికి రానివ్వాలన్నారు. ఈవీఎమ్​ల బాధ్యత పీవోలదేనని స్పష్టం చేశారు. పోలింగ్ ఏజెంట్ స్థానిక పోలింగ్ స్టేషన్​లో ఉంటే వారికి ఓటరు జాబితాలో పేరు ఉంటేనే ఓటు వేయాలని, పోలింగ్ బూత్ ఏజెంట్ ఆ నియోజకవర్గంలో ఓటరు అయి ఉండాలన్నారు.

ఒక్కో ఎలక్షన్​కు నిబంధనలు మారుతున్న నేపథ్యంలో పీవోలు శిక్షణ తరగతులు శ్రద్ధగా విని ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా అడిషనల్​ కలెక్టర్​ వెంకటేశ్వర్లు, మెదక్​, తూప్రాన్ ఆర్డీవోలు అంబదాస్​ రాజేశ్వర్​, జయచంద్ర, డీఈవో రాధాకిషన్​, డీఎస్​వో  రాజిరెడ్డి, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.

వంద శాతం పోలింగ్​ లక్ష్యం

స్వీప్ మెదక్ జిల్లా ఆధ్వర్యంలో ఎలక్ట్రోరల్​ లిటరసీ క్లబ్ సభ్యులను భాగస్వాములను చేయాలని రూపొందించిన విద్యార్థి హామీ పత్రాన్ని కలెక్టర్​ రాజర్షి షా, ఎస్పీ రోహిణి ప్రియదర్శిని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్, ఎస్పీ  మాట్లాడుతూ.. విద్యార్థులు, తల్లిదండ్రులకు, కుటుంబసభ్యులకు సమాచారం అందించి వంద శాతం పోలింగ్​ జరిగే విధంగా కృషి చేయాలన్నారు.