
మెదక్ టౌన్, వెలుగు: కుల వృత్తుల సంక్షేమం కోసమే తెలంగాణ ప్రభుత్వం బీసీ బంధు ప్రవేశపెట్టిందని కలెక్టర్ రాజర్షి షా, ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం కలెక్టరేట్లో లబ్ధిదారులకు మూడో విడత బీసీ బంధు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్రాజర్షి షా మాట్లాడుతూ.. కుల వృత్తుల వారు అధునాతన పరికరాలు కొనుగోలు చేయడానికి ప్రభుత్వం బీసీ బంధు కింద రూ. లక్ష కేటాయిస్తోందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా నిలదొక్కుకోవాలని సూచించారు.
అనంతరం ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలు అమలు చేస్తూ సీఎం కేసీఆర్ తెలంగాణను అగ్రస్థానంలో నిలబెట్టారన్నారు. బీసీ బంధు పథకాన్ని సద్వినియోగం చేసుకుని కులవృత్తుల వారు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ రమేశ్, జడ్పీ వైస్ చైర్ పర్సన్లావణ్య, మున్సిపల్ చైర్మన్చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు.