![జిల్లా పరిషత్ హైస్కూల్లో గుస్సాడి డ్యాన్స్ చేసిన కలెక్టర్](https://static.v6velugu.com/uploads/2025/02/collector-rajarshi-shah-and-sub--collector-yuvraj-marmat-attended-the-district-level-tribal-cultural-meet-2024-25_LT0jt6GqWk.jpg)
ఆదిలాబాద్, వెలుగు: ఆదివాసీ కళాకారులు, విద్యార్థులతో కలిసి నెత్తిన నెమలి టోపీ పెట్టి.. కాలు కదుపుతూ గుస్సాడి నృత్యంతో కలెక్టర్ రాజర్షి షా సందడి చేశారు. మంగళవారం ఇంద్రవెల్లి మండలంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో నిర్వహించిన జిల్లా స్థాయి ట్రైబల్ కల్చరల్ మీట్ 2024–25లో భాగంగా కలెక్టర్‌తోపాటు సబ్ కలెక్టర్ యువరాజ్ మర్మట్ హాజరయ్యారు. విద్యార్థులతో కలిసి కాసేపు గుస్సాడి నృత్యం చేసి అలరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. మన సంస్కృతిని కాపాడుకుంటూ ఇతర సంస్కృతులను గౌరవించాలన్నారు.
తమ సంస్కృతిలోని గొప్పదనాన్ని చాటిచెప్పుకునే అవకాశాన్ని రాజ్యాంగం మనకు కల్పించిందన్నారు. ఇందులో భాగంగానే సమగ్ర శిక్ష తెలంగాణ ఆధ్వర్యంలో ఈ ఏడాది జిల్లాలో సంస్కృతి సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గోండు సంస్కృతిలోని చిత్రకళ, నృత్య కళ, గుస్సాడీ థింసాను పిల్లలకు నేర్పి, వారిచే ప్రదర్శనలు ఇప్పించడానికి రెండ్రోజుల వర్క్‌షాప్ నిర్వహించినట్లు పేర్కొన్నారు. పిల్లలు వేసిన గోండు చిత్ర కళ ప్రదర్శనను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో డీఈవో ప్రణీత, తహసీల్దార్ ప్రవీణ్, సెక్టోరియిల్ అధికారి ఉదయశ్రీ, ఎంఈవో మను కుమార్, హెచ్ఎం సాకేత్ రాంమోహన్ పాల్గొన్నారు.