ఆదివాసీల సంస్కృతి ప్రపంచానికి తెలియాలి

ఆదివాసీల సంస్కృతి ప్రపంచానికి తెలియాలి
  • ప్రజా దర్బార్​లో కలెక్టర్ రాజర్షి షా 
  • పెద్ద ఎత్తున హాజరైన ఆదివాసీలు 
  • ఆకట్టుకున్న కళాకారుల నృత్యాలు 
  • ఎన్నికల కోడ్​ కారణంగా ప్రజాప్రతినిధుల రాకతో స్టేజి దిగిపోయిన అధికారులు

ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్​ జిల్లాలోని ఆదివాసీల అభివృద్ధికి కృషి చేస్తామని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఆదివాసీల ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలు ప్రపంచానికి తెలియాల్సిన అవసరం ఉందన్నారు. శుక్రవారం నాగోబా జాతర సందర్భంగా నిర్వహించిన ప్రజా దర్బార్​కు జనం భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. దేశంలో రెండో అతిపెద్ద గిరిజన జాతరగా పేరుపొందిన నాగోబాకు మరింత గుర్తింపు రావాల్సిన అవసరం ఉందన్నారు.

 ప్రతి ఏడాదిలాగే జాతరలో భక్తులకు అన్ని సదుపాయాలు కల్పించామని, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ఛత్తీస్​గఢ్​ నుంచి భక్తులు తరలివచ్చారని తెలిపారు. ఆదివాసీల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. జాతరలో ప్రత్యేకంగా గ్రీవెన్స్ ఏర్పాటు చేసి అర్జీలు స్వీకరించినట్లు చెప్పారు. గతంలో ఇచ్చిన దరఖాస్తులు ఏమైనా పెండింగ్​లో ఉంటే వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. 

అభివృద్ధి పనులకు ఆటంకాలు లేకుండా చూసుకుంటున్నాం

ఏజెన్సీలో విద్యా, వైద్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. ఐటీడీఏ ద్వారా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, ఆశ్రమ స్కూళ్లతోపాటు అన్ని పాఠశాలల్లో గిరిజన పోషక్ మిత్ర కార్యక్రమం కొనసాగుతోందని తెలిపారు. మొబైల్ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. ఆదివాసీ యువతకు జాబ్ మేళాలు నిర్వహించి వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు కల్పిస్తున్నామన్నారు. ఫారెస్ట్ అధికారులతో చర్చలు జరిపి ఏజెన్సీలోని అభివృద్ధి పనులకు ఆటంకాలు లేకుండా చూసుకుంటున్నామని చెప్పారు.

Also Read :- కేస్లాపూర్‌‌‌‌కు పోటెత్తిన భక్తులు..కిక్కిరిసిన ఆలయ పరిసరాలు

తొలిసారి 1942లో  నిర్వహించిన దర్బార్ హైమన్ డార్ఫ్ ఆధ్వర్యంలో జరిగిందని, ఇప్పటికి 78  ఏండ్లు పూర్తిచేసుకొని 79 సంవత్సరంలోకి అడుగుపెట్టిందని చెప్పారు. ఈ సందర్భంగా కళాకారులు చేపట్టిన ఆదివాసీ సాంప్రదాయ నృత్యాలు ఆకట్టుకున్నాయి. అంతకుముందు ఎస్పీ గౌస్ ఆలం, ఐటీడీఏ పీవో ఖుష్భు గుప్తా, అదనపు కలెక్టర్ శ్యామల దేవితో కలిసి పూజలు చేశారు. అటవీ శాఖ అధికారి ప్రశాంత్ బాజీరావ్ పాటిల్, ఏఎస్పీ కాజల్, ఎఫ్​డీవో రేవంత్ చంద్ర, సబ్ కలెక్టర్ యువరాజ్, ట్రైనీ కలెక్టర్ అభిజ్ఞాన్, మెస్రం వంశ పెద్దలు పాల్గొన్నారు.  

మంత్రి, ఎమ్మెల్యేల రాక.. అధికారుల పరుగులు

పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఎఫెక్ట్ నాగోబా జాతర ప్రజా దర్బార్ పై పడింది. అధికారిక కార్యక్రమం కావడంతో జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర ఉన్నత అధికారులు ప్రజాదర్బార్ లో పాల్గొన్నారు. అయితే కార్యక్రమం జరుగుతున్న సమయంలో ఎంపీ గొడం నగేశ్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రజాదర్బార్​కు రావడం చూసి కలెక్టర్ సహా ఇతర అధికారలంతా స్టేజీ మీద నుంచి వెళ్లిపోయారు. ఎంపీ, ఎమ్మెల్యే వచ్చి ప్రజల మధ్య కూర్చున్నప్పటికీ కోడ్ కారణంగా అధికారులు గదిలో నుంచి బయటకు రాకపోవడంతో ప్రజలతోపాటు ఎంపీ, ఎమ్మెల్యేలు కూడా కొద్ది సేపు అయోమయానికి గురయ్యారు.

 కోడ్ ఉందని, అందుకే అధికారులు వెళ్లారని చెప్పడంతో ఎంపీ, ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం అధికారులు స్టేజీ మీదకు వచ్చి ప్రసంగించారు. దర్బార్ ముగింపు దశలో ఉండగా మంత్రి సీతక్క, ఎమ్మెల్యేలు వస్తున్నారనే తెలియడంతో మరోసారి కలెక్టర్, ఎస్పీ, పీవోలు పక్కనే ఉన్న గదిలోకి వెళ్లిపోవాల్సి వచ్చింది.  మంత్రి కార్యక్రమం ముగిసి వెళ్లిపోయేంత వరకు అధికా రులు రూమ్​లో నుంచి బయటకు రాలేదు.