పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి : కలెక్టర్‌ రాజర్షి షా

గుడిహత్నూర్, వెలుగు : పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. శనివారం మండల కేంద్రంలోని మోడల్‌స్కూల్‌లో నిర్వహిస్తున్న పదో తరగతి పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పరీక్షలు జరుగుతున్న తీరును పరిశీలించారు. అనంతరం స్థానిక ఉర్దూ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించారు.

ఉర్దూ పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరును స్థానికులు కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఉపాధ్యాయులు సక్రమంగా బోధించడం లేదని, దీంతో తాము తమ పిల్లలను ప్రైవేట్ స్కూళ్లకు పంపాల్సి వస్తుందన్నారు. ఉర్దూ పాఠశాలలో మొత్తం 84 మంది విద్యార్థులు ఉండగా, నిత్యం పది మంది మాత్రమే హాజరవుతున్నారని ఫిర్యాదు చేశారు. దీంతో కలెక్టర్‌ టీచర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల కొరత లేదని, 84 మంది విద్యార్థులకు ముగ్గురు ఉపాధ్యాయులే ఉంటారని ప్రశ్నించారు. విషయంపై డీఈవో వివరణ ఇవ్వాలని కలెక్టర్​ఆదేశించారు. ఆయన వెంట తహసీల్దార్‌ కవితారెడ్డి, ఎంపీడీవో అబ్దుల్‌ మహమ్మద్‌హై, పంచాయితీ సిబ్బంది ఉన్నారు. 

పోలింగ్‌ కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు చేయాలి

గుడిహత్నూర్, వెలుగు : లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్‌కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. శనివారం మండలంలోని గోండ్‌హర్కాపూర్, గుడిహత్నూర్‌ పోలింగ్‌కేంద్రాలను ఆయన పరిశీలించారు. మండల కేంద్రంలోని 102, 103, 104 పోలింగ్‌ కేంద్రాలను ఉర్దూ పాఠశాలకు మార్చడంతో అక్కడ వసతులను పరిశీలించి పలు సూచనలు చేశారు. దివ్యాంగుల కోసం అవసరమైన ర్యాంపు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

అనంతరం మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులు, ప్రసూతి వార్డును పరిశీలించారు. ప్రజలకు అందిస్తున్న సేవలు,  ఓపీ నమోదు వివరాల గురించి వైద్యాధికారి డాక్టర్‌శ్యామ్​సుందర్‌ను అడిగి తెలుసుకున్నారు. రాత్రిళ్లు విధులు నిర్వహించే సిబ్బంది వివరాలు బోర్డుపై రాసి ఉంచాలని, ఇది ప్రతి పీహెచ్‌సీ వైద్యులు పాటించాలని కలెక్టర్​ఆదేశించారు. ఆయన వెంట తహసీల్దార్‌ కవితారెడ్డి, ఎంపీడీవో అబ్దుల్‌మహమ్మద్‌హై, పంచాయతీ కార్యదర్శి చక్రవర్తి, సిబ్బంది ఉన్నారు.