నాగోబా జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు : కలెక్టర్ రాజర్షి షా

నాగోబా జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు : కలెక్టర్ రాజర్షి షా
  • 28న రాత్రి పూజతో జాతర ప్రారంభం

ఆదిలాబాద్, వెలుగు: నాగోబా మహా జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆదిలాబాద్​ కలెక్టర్ రాజర్షి షా చెప్పారు. నాగోబా జాతర ఏర్పాట్లను శుక్రవారం ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్, ఎస్పీ గౌస్ ఆలం, ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా తో కలిసి పరిశీలించారు. మర్రిచెట్టు ప్రాంతం, కోనేరు, గోవాడ్, తై బజార్, స్టాల్స్, దేవాలయ ప్రాంతం, తదితర ప్రాంతాల్లో చేపడుతున్న పనులను పరిశీలించి వేగంగా పూర్తిచేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

 అనంతరం నాగోబా జాతరపై దర్బార్ హాల్ లో ప్రభుత్వ శాఖల అధికారులతో రివ్యూ నిర్వహించారు. జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని, కంట్రోల్ రూం ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. ఈనెల 28న రాత్రి 10 గంటలకు వరూళి ప్రతిష్ఠ (మట్టితో తయారు చేసిన పుట్ట) పూజతో జాతర ప్రారంభమవుతుందన్నారు. జనవరి 31న నాగోబా దర్బార్ ఉంటుందని పేర్కొన్నారు. 

ఫిబ్రవరి 4 వరకు జాతరలో జంతుబలి, మద్యం, ప్లాస్టిక్ పై నిషేధం విధిస్తున్నట్లు చెప్పారు. నాగోబాకు వచ్చే ప్రతి బస్ కు జాతర స్టిక్జర్లు అతికించాలన్నారు. జాతరను సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని ఎమ్మెల్యే బొజ్జు పిలుపునిచ్చారు. సబ్ కలెక్టర్ యువరాజ్ మర్మట్, ట్రైనీ కలెక్టర్ అభిగ్ఞాన్, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.