నిర్మల్/ఆదిలాబాద్టౌన్/కాగజ్నగర్/జైపూర్/కడెం, వెలుగు; జిల్లాలోని అర్హులందరికీ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలు అందేలా అధికారులు కృషి చేయాలని ఆదిలాబాద్కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. సంక్షేమ పథకాల ఫీల్డ్ వెరిఫికేషన్, గ్రామ సభలపై ఆదివారం సంబంధిత అధికారులతో కలెక్టర్ గూగుల్ మీట్లో మాట్లాడారు. రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదేశాల మేరకు ఈ నెల 21 నుంచి 24 వరకు నిర్వహించే గ్రామసభ లకు విస్తృత ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రతి రోజూ ఒక గ్రామ పంచాయతీలో మాత్రమే గ్రామ సభలు నిర్వహించాలని, హాజరయ్యే ప్రజలకు అన్ని సదుపాయాలను కల్పించాలని సూచించారు.
గూగుల్ మీట్ లో ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా, అడిషనల్కలెక్టర్ శ్యామలాదేవి, సబ్ కలెక్టర్ యువరాజ్ మర్మట్ తదితరులు పాల్గొన్నారు. నూతన పథకాల లబ్ధిదారుల ఎంపిక సర్వే, గ్రామ, వార్డు సభలు, పథకాల అమలుపై నిర్మల్ కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్ అభిలాష అభినవ్ మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వం అందించనున్న పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చూడాలని ఆదేశించారు. సర్వేను పకడ్బం దీగా నిర్వహించాలని, ఎలాంటి తప్పిదాలు జరగకుండా నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలన్నారు. రోజువారీగా నిర్వహించిన సర్వే వివరాలను ఎప్పటికప్పుడు అందజేయాలని సూచించారు.
సాగుకు యోగ్యంకాని భూములను గుర్తించాలి
మంచిర్యాల జిల్లా భీమారం మండలం ఆరేపల్లి, అర్కపల్లి గ్రామాల్లో జరుగుతున్న సర్వే ప్రక్రియను కలెక్టర్ కుమార్ దీపక్ పరిశీలించారు. రైతు భరోసా పథకంలో భాగంగా జిల్లాలో వ్యవసాయ సాగుకు యోగ్యం కాని రాళ్లు, గుట్టలు, నివాస గృహాలు, వెంచర్లు, లే అవుట్లు తదితర భూములను గుర్తించి రైతు భరోసా జాబితా నుంచి తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాగజ్ నగర్ లోని ఎన్జీవోస్ కాలనీలో చేపడుతున్న సర్వేను కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే పరిశీలించారు. అనంతరం సబ్ కలెక్టర్ అఫీస్లో సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లాతో కలిసి తహసీల్దార్లు, మండల వ్యవసాయ అధికారులతో రివ్యూ నిర్వహించారు.
సాగుకు యోగ్యమయ్యే భూములకు మాత్రమే రైతు భరోసా అందేలా చూడాలన్నారు. సర్వే సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలించి జాబితా రూపొందించాలని ఆదేశించారు. కడెం మండలంలోని వివిధ గ్రామాల్లో జరుగుతున్న సర్వే తీరును అదనపు కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ కిషోర్ కుమార్ పరిశీలించారు. మండలంలోని పెద్దూరు గ్రామ పరిధిలో గల 69,70,71 సర్వే నెంబర్లలో సాగుకు యోగ్యం కాని 87 ఎకరాల భూమిని గుర్తించి రైతుబంధు పథకాన్ని నిలిపివేసినట్లు ధృవీకరించారు.