ఎస్సీ, ఎస్టీల గౌరవానికి భంగం కలిగించొద్దు : కలెక్టర్ రాజర్షి షా

ఎస్సీ, ఎస్టీల గౌరవానికి భంగం కలిగించొద్దు : కలెక్టర్ రాజర్షి షా

మెదక్, వెలుగు:  ఎస్సీ, ఎస్టీల గౌరవానికి భంగం కలిగించొద్దని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. స్థానిక ఇంటిగ్రేటెడ్​కలెక్టరేట్​లో మంగళవారం జిల్లా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్​అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్సీలు శేరి సుభాష్​రెడ్డి, యాదవరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులైన దళితుల పట్ల పొలీస్ అధికారులు, ఇతర శాఖల అధికారులు సున్నితంగా వ్యవహరించాలని, వారికి వ్యవస్థ పట్ల విశ్వాసం కలిగించేలా పనితీరు ఉండాలని సూచించారు.

ప్రతి 3 నెలల కు ఒక సారి కమిటీ సమావేశం నిర్వహించాలన్నారు. ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి మాట్లాడుతూ కేసులలో బాధితులకు అందవలసిన ఆర్థిక పరిహారం సకాలంలో అందించి వారికి సాంత్వన కలిగించేలా చూడాలని అధికారులకు సూచించారు.  మరో ఎమ్మెల్సీ యాదవరెడ్డి  మాట్లాడుతూ సమాజంలో అందరూ ఒకటే అని, ఎలాంటి వివక్ష లేకుండా సమాజంలో కలసి మెలసి జీవించాలన్నారు. ఈ సమావేశంలో ఎస్పీ బాల స్వామి, అడిషనల్​కలెక్టర్ లు రమేశ్, వెంకటేశ్వర్లు, జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి విజయలక్ష్మి, సంబంధిత శాఖల జిల్లా అధికారులు, ఆర్డీవోలు, డీఎస్పీలు, విజిలెన్స్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.