పుస్తకాలు చదివే కలెక్టర్​ను అయ్యా :  కలెక్టర్ రాజర్షి షా

పుస్తకాలు చదివే కలెక్టర్​ను అయ్యా :  కలెక్టర్ రాజర్షి షా

ఆదిలాబాద్​ టౌన్, వెలుగు: ప్రతి విద్యార్థి చిన్ననాటి నుంచి పుస్తక పఠనాన్ని అలవర్చుకోవాలని, తాను చిన్నతనం నుంచే పుస్తకాలు చదవడం వల్ల కలెక్టర్​ను అయ్యానని ఆదిలాబాద్​ పాలనాధికారి రాజర్షి షా అన్నారు. నేషనల్​ బుక్​ట్రస్ట్ నిర్వహిస్తున్న మొబైల్ ​లైబ్రరీ వాహనాన్ని బుధవారం పట్టణంలోని ప్రభుత్వ బాలికల హైస్కూల్​లో కలెక్టర్​ ప్రారంభించారు. అమ్మా నాన్నలు ఖర్చుల కోసం ఇచ్చే డబ్బులను పొదుపు చేసి పుస్తకాలు కొనుగోలు చేసి చదివే అలవాటు చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు.

సంచార పుస్తక ప్రదర్శన వాహనం జిల్లాలో నాలుగు రోజులు వివిధ స్కూళ్లను సందర్శిస్తుందని, దీన్ని సద్వినియోగం చేసుకునేలా హెచ్​ఎంలు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఇదే స్కూల్​లో పుస్తకమిత్ర సంస్థ అందించిన రూ.40 వేల విలువైన పుస్తకాలతో ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో డీఈవో టి.ప్రణీత, ఎంఈవో సోమయ్య, హెచ్​ఎం కె.రమేశ్​రెడ్డి, నేషనల్ బుక్ ట్రస్ట్ కోఆర్డీనేటర్స్​ అశోక్, దేవ్ రావు, సెక్టోరల్ అధికారి సుజాత్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.