- ఈ సేవా కేంద్రాలు, ఎంపీడీవో ఆఫీసుల్లో ఎడిట్ ఆప్షన్
- కలెక్టరేట్ లో ప్రజా సేవా పాలన కేంద్రం ప్రారంభం
ఆదిలాబాద్, వెలుగు: కాంగ్రెస్ సర్కారు ఆరు గ్యారంటీల్లో భాగంగా పలు పథకాలను అమలు చేస్తోంది. అయితే ఇందుకు సంబంధించి గతంలో స్వీకరించిన దరఖాస్తుల్లో దొర్లిన తప్పులు, పూర్తి సమాచారం నమోదు చేయకపోవడంతో చాలా మంది ఈ పథకాలకు దూరమయ్యారు. ఈ క్రమంలోనే వారికి మరో అవకాశం ఇస్తూ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. ప్రజాపాలన కేంద్రాల్లో దరఖాస్తులు చేసుకొని పథకాలు అందని వారి కోసం ఆదిలాబాద్ కలెక్టరేట్ లోని సీపీవో కార్యాలయంలో ఇటీవల ప్రజాపాలన సేవా కేంద్రాన్ని కలెక్టర్ రాజర్షి షా ప్రారంభించారు.
దరఖాస్తుతో చిన్న చిన్న తప్పిదాలతో చాలా మంది ఈ పథకాలకు దూరమయ్యారని, వీరంతా తమ రేషన్ కార్డు, ఆధార్, విద్యుత్తు సర్వీస్కనెక్షన్ నెంబర్, గ్యాస్ కనెక్షన్, ఎల్పీజీ ఐటీ, మొబైల్ నెంబర్ తో ప్రజాపాలన సేవా కేంద్రంలో సవరణ చేసుకోవాలని సూచించారు. ఎంపీడీవో, మున్సిపాలిటీ, ఈ సేవా కేంద్రాల్లో ఆయా మండలాల లబ్ధిదారులు తమ దరఖాస్తులు సవరించుకునే అవకాశం కల్పించారు.
ఎడిట్ ఆప్షన్‌తో సవరణ
గృహ జ్యోతి కింద 200 యూనిట్లకు ప్రభుత్వం జీరో కరెంట్ బిల్లులు ఇస్తోంది. అయితే కొంత మంది అవగాహన లోపంతో సర్వీస్, యూఎస్సీ నెంబర్లు తదితర వివరాలు తప్పుగా నమోదు చేయడం, దరఖాస్తుల ఆన్ లైన్ సమయంలో ఆపరేటర్ల తప్పులతోనూ చాలా మందికి జీరో బిల్లులు రావడం లేదు. దీంతో ఆ తప్పులను సవరించే వెసులుబాటు ప్రభుత్వం మళ్లీ కల్పించింది. ఇతర ప్రాంతాలకు ఉపాధి కోసం వెళ్లేవారు చాలా మంది ఇండ్లు మారుస్తున్నారు. దీంతో వారు లబ్ధి పొందలేకపోతున్నారు. ఇలాంటివారు ప్రజాపాలన పోర్టల్‌లో ఎడిట్ ఆప్షన్ ఆధారంగా మార్పులు చేసుకునే అవకాశం ఉంది.
అన్నీ సరిగా ఉంటే వచ్చే నెల నుంచే వీరికి జీరో బిల్లులు రానున్నాయి. జిల్లా వ్యాప్తంగా 2.19 లక్షల విద్యుత్ సర్వీసులు ఉండగా ఇందులో 78 వేల సర్వీసులకు గృహజ్యోతి ద్వారా లబ్ధి లబ్ధిపొందుతున్నారు. పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు రూ.12 కోట్లు జీరో బిల్లులు ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. అటు మహాలక్ష్మి పథకం కింద 95 వేల మంది లబ్ధి పొందుతున్నారు. ఇప్పటి వరకు రూ.3.94 కోట్లు సబ్సిడీ అమౌంట్ డిపాజిట్ అయింది. సవరణల ద్వారా లబ్ధిదారులు సంఖ్య పెరగనుందని అధికా రులు చెప్తున్నారు.
2.30 లక్షల దరఖాస్తులు
ప్రభుత్వం ఆరు గ్యారంటీ పథకాల్లో భాగంగా మహాలక్ష్మి పథకం కోసం రూ.2,500 ఆర్థిక సాయం, రూ.500 సిలిండర్, రైతు భరోసా పథకంలో భాగంగా ఎకరానికి రూ.15వేలు, రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు ఏడాదికి రూ.12 వేలు, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి పథకంలో భాగంగా నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, చేయూత పథకానికి దరఖాస్తులు చేసుకున్న విషయం తెలిసిందే. వీటితో పాటు కొత్త రేషన్ కార్డుల కోసం సైతం సపరేట్ గా ప్రజా పాలన కేంద్రంలో దరఖాస్తులు చేసుకున్నారు. మొత్తం మీద ప్రజాపాలన కేంద్రాల ద్వారా ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా దాదాపు 2.30 దరఖాస్తులు రాగా, అందులో దాదాపు 29 వేల దరఖాస్తుల్లో రేషన్ కార్డులు, ఫించన్లు, ఇతర అంశాలకు సంబంధించినవి ఉన్నాయి.