మహిళా శక్తి లక్ష్యాలను సాధించాలి : రాజర్షి షా

మహిళా శక్తి లక్ష్యాలను సాధించాలి : రాజర్షి షా

ఆదిలాబాద్‌‌ టౌన్‌‌, వెలుగు : బ్యాంకర్లకు ఇచ్చిన మహిళా శక్తి టార్గెట్‌‌ను చేరుకోవాలని కలెక్టర్‌‌ రాజర్షి షా ఆదేశించారు. 2023 – 24 సంవత్సరానికి సంబంధించిన డీసీసీ, డీఎల్‌‌ఆర్‌‌సీ మీటింగ్‌‌ను గురువారం కలెక్టరేట్‌‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా లక్ష్యాలు, గత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకులు సాధించిన విజయాల వివరాలను వివరించారు. అనంతరం కలెక్టర్‌‌ మాట్లాడుతూ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర  ప్రభుత్వం చేపట్టిన మహిళా శక్తి కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం చేయాలని సూచించారు. 

లక్ష్యాన్ని సాధించేందుకు వీలుగా సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు. మహిళా శక్తి కార్యక్రమం ద్వారా 15 రకాల కార్యక్రమాలు చేపడుతున్నారని, ఇందుకోసం బ్యాంకుల నుంచి మహిళలకు లోన్లు మంజూరు చేయాలని సూచించారు. అనంతరం 2024–--25 సంవత్సరానికి సంబంధించిన వార్షిక రుణప్రణాళిక పోస్టర్‌‌ను విడుదల చేశారు. కార్యక్రమంలో ఆఫీసర్లు ప్రసాద్, ఉత్పల్‌‌కుమార్‌‌, దేబోజీ బారువా, సాయన్న పాల్గొన్నారు.

ట్రాన్స్‌‌జెండర్లకు గుర్తింపుకార్డులు

ఆదిలాబాద్‌‌ జిల్లాలోని ట్రాన్స్‌‌ జెండర్లకు కలెక్టర్‌‌ రాజర్షి షా గురువారం గుర్తింపు కార్డులు, సర్టిఫికెట్లు అందజేశారు. కలెక్టరేట్‌‌ మీటింగ్‌‌ హాల్‌‌లో ట్రాన్స్‌‌జెండర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌‌ మాట్లాడుతూ ట్రాన్స్‌‌జెండర్లకు సమాజంలో గుర్తింపు, హక్కుల పరిరక్షణ కోసం ఐడీ కార్డులు, సర్టిఫికెట్లు అందజేస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా 8 మందికి కార్డుల అందజేశారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి సబిత, ఏసీడీపీవో మిల్కా పాల్గొన్నారు.