
ఆదిలాబాద్/లక్ష్మణచాంద/సారంగాపూర్/కాగజ్ నగర్/తాండూరు, వెలుగు: భూభారతిపై రైతులు అవగాహన పెంచుకోవాలని ఆదిలాబాద్కలెక్టర్ రాజర్షి షా అన్నారు. శుక్రవారం గాదిగూడ, నార్నూర్ మండల కేంద్రాల్లో నిర్వహించిన భూభారతి అవగాహన సదస్సులో పాల్గొన్నారు. పలువురు రైతులు భూ భారతి చట్టంపై సందేహాలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా నివృత్తి చేశారు. అనంతరం మాట్లాడుతూ మారుమూల ప్రాంతాల్లో వసతుల కల్పనకు చొరవ తీసుకొని అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు.
భూ భారతి చట్టం ద్వారా అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంద న్నారు. అనంతరం నార్నూర్ లో చేపడుతున్న చెరువు పూడిక తీత పనులను ప్రారంభించారు. మండల కేంద్రానికి చెందిన సన్న బియ్యం లబ్ధిదారుడు జెల్లపల్లి సుకుమార్ ఇంట్లో కలెక్టర్ భోజనం చేసి కుటుంబ సభ్యులను శాలువాతో సన్మానించారు.
నిర్ణీత గడువులోగా పరిష్కారం
భూభారతి చట్టం అమలు ద్వారా ఎన్నో సంవత్సరాలుగా ప్రజలు ఎదుర్కొంటున్న భూ సమస్యలన్నీ పరిష్కారమవుతాయని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. లక్ష్మణచాంద మండల కేంద్రంలోని రైతు వేదికలో, సారంగపూర్‌లో నిర్వహించిన అవగాహన సదస్సులో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. భూభారతి చట్టం అమలు ద్వారా భూముల రిజిస్ట్రేషన్, తదితర అంశాల పరిష్కారానికి దరఖాస్తులు చేసుకున్న వాటికి నిర్ణీత గడువు ఉంటుందని, ఆ గడువు లోపలే అధికారులు పరిష్కరించాల్సి ఉంటుందని తెలిపారు. ఎక్కువ శాతం భూ సమస్యలు తహసీల్దార్ స్థాయిలోనే పరిష్కారమవుతాయని తెలిపారు. క్రయవిక్రయాల ద్వారా పట్టా మార్పిడి, వారసత్వ పట్టా మార్పిడి వంటి అనేక పనులు సులభతరంగా చేసుకోవచ్చన్నారు.
సారంగాపూర్ మండలంలో కమిటీని ఏర్పాటు చేసి ఆక్రమణకు గురైన భూములను వెలికి తీస్తామన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ కిషోర్ కుమార్, తహసీల్దార్ జానకి, ఎంపీడీవో రాధ రాథోడ్, మండల ప్రత్యేక అధికారి మోహన్ సింగ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ భీంరెడ్డి, వైస్ చైర్మన్ ఈటల శ్రీనివాస్, డీసీసీబీ వైస్ చైర్మన్ రఘునందన్ తదితరులు పాల్గొన్నారు. సారంగాపూర్తహసీల్దార్ శ్రీదేవి, ప్రత్యేక అధికారి బాలిఘ్ హైమద్, ఎంపీడీవో లక్ష్మీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
సమస్యలు పూర్తిగా తీరిపోతాయి
గతంలో రైతులు ఇబ్బందులు పడ్డారని, కాంగ్రెస్ప్రభుత్వం కొత్తగా తెచ్చిన భూ భారతి చట్టంతో భూ సమస్యలు పూర్తిగా తీరిపోనున్నాయని ఆసిఫాబాద్కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. కౌటాల, పెంచికల్ పేట మండల కేంద్రాల్లోని రైతు వేదికలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఎమ్మెల్సీ దండే విఠల్, అడిషనల్ కలెక్టర్ డేవిడ్, కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధాశుక్లాతో కలిసి పాల్గొన్నారు. కలెక్టర్ స్థానిక వ్యవహార భాష మరాఠీలో మాట్లాడారు.
భూభారతి చట్టంలో పొందుపరిచిన అంశాలు, హక్కుల ద్వారా రైతుల సమస్యలు పరిష్కరించేందుకు అవకాశం ఉందన్నారు. తహసీల్దార్, సబ్ కలెక్టర్, కలెక్టర్, సీసీఎల్ ఏ స్థాయిల్లో సమస్యలపై అప్పీల్ చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. కాగజ్ నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సిద్దల దేవయ్య, ఏడీఏ మనోహర్, తహసీ ల్దార్ పుష్పలత, ఎంపీడీవో రమేశ్, మండల వ్యవసాయ అధికారి ప్రేమలత పాల్గొన్నారు.
రైతులకు ఎంతో మేలు
భూసమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి చట్టం రైతులకు ఎంతో మేలు చేస్తుందని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్అన్నారు. తాండూరు మండలం కేంద్రంలో జరిగిన భూభారతి అవగాహన సదస్సులో ఆయన పాల్లొని మాట్లాడారు. ఆర్ఓఆర్చట్టం ద్వారా భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. ఈవిషయంలో రైతులకు పూర్తిగా అవగాహన కల్పించాలన్నారు. మ్యూటేషన్, రిజిస్ర్టేషన్ చేయడానికి భూములను సర్వేచేసి పూర్తిగా మ్యాప్‌ను తయారు చేస్తామని తెలిపారు. అడిషనల్ కలెక్టర్ మోతీలాల్, బెల్లంపల్లి ఆర్డీవో హరికృష్ణ, తహసీల్దార్ ఇమ్రాన్ ఖాన్, ఎంపీడీవో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.