నాగోబా జాతరకు యాక్షన్ ప్లాన్: కలెక్టర్ రాజర్షి షా

నాగోబా జాతరకు యాక్షన్ ప్లాన్: కలెక్టర్ రాజర్షి షా

ఆదిలాబాద్, వెలుగు: జనవరి 28 నుంచి ప్రారంభం కానున్న కేస్లాపూర్ నాగోబా జాతరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా యాక్షన్ ప్లాన్ రూపొందించనున్నట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. గురువారం జిల్లా ఎస్పీ గౌస్ ఆలం, ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా, సబ్ కలెక్టర్ యువరాజ్ మర్మట్, ట్రైనీ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియా, అడిషనల్ ఎస్పీ కాజల్​తో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు, అధికారులతో జాతర ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. 

కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ నెల 28న మహాపూజ కార్యక్రమంతో జాతర ప్రారంభమవుతుందని, 31న దర్బార్ నిర్వహిస్తారని తెలిపారు. జాతరకు ఉమ్మడి ఆదిలా బాద్ జిల్లా నుంచే కాకుండా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని, వారికి ఎలాంటి ఇబ్బం దులు కలగకుండా అన్ని సదుపాయలు కల్పిస్తున్నట్లు చెప్పారు. రోడ్ల రిపేర్లు, తాగునీరు, టాయిలెట్స్, ఇతర పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. 

మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన కలెక్టర్

ఇంద్రవెల్లి మండలం పిట్ట బొంగరం గ్రామంలో నవజ్యోతి యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని కలెక్టర్ రాజర్షి షా ఐటీడీఏ పీవో ఖుష్భు గుప్తాతో కలిసి ప్రారంభించారు. 150 మంది రక్తదానం చేయడానికి రాగా వారిని అభినందించారు. ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.