
-బోథ్/జైనూర్/భీమారం/కోటపల్లి/పెంబి, వెలుగు: పెండింగ్‌లో భూ సమస్యలను పరిష్కరించి భూ యాజమాన్య హక్కులు కాపాడేందుకే ప్రభుత్వం భూభారతి చట్టం తీసుకొచ్చిందని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మంగళవారం ధన్నూర్'బి', సొనాల గ్రామాల్లో నిర్వహించిన భూ భారతి చట్టం అవగాహన సదస్సులకు కలెక్టర్ హాజరై మాట్లాడారు. ధరణి పోర్టల్‌లో పరిష్కారం కాని అనేక సమస్యలను భూ భారతి చట్టం పరిష్కరిస్తుందని, జిల్లా లెవల్లో కూడా అప్పీల్‌కు అవకాశాలు ఉన్నాయన్నారు.
ప్రతి ఒక్కరికి భూదార్ కార్డులు అందిస్తామని తెలిపారు. సాదాబైనామా సమస్యలు, అసైన్డ్ భూముల సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. అడిషనల్కలెక్టర్శ్యామలాదేవి, ఆర్డీవో వినోద్ కుమార్, మార్కెట్ చైర్మన్బొడ్డు గంగారెడ్డి, స్పెషల్ ఆఫీసర్ వాజిద్, తహసీల్దార్సుభాష్, ఎంపీడీవో రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
భూ సమస్యల పరిష్కారానికే భూ భారతి
భూభారతి చట్టంతో రైతుల భూ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఆసిఫాబాద్, నిర్మల్ కలెక్టర్లు వెంకటేశ్ ధోత్రే, అభిలాష అభినవ్ అన్నారు. జైనూర్ మండలం గౌరీకొలంగూడ సిర్పూర్ యు గ్రామపంచాయతీలోని రైతు వేదికలో ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో ఎమ్మెఎల్సీ దండే విఠల్ తో కలిసి ధోత్రే పాల్గొన్నారు. పెంబి మండల కేంద్రంలోని రైతు వేదికలో రైతులకు భూ భారతి చట్టంపై కలెక్టర్ అభిలాష అవగాహన కల్పించారు. భూభారతి చట్టంలో పొందుపరిచిన అంశాలు, హక్కుల ద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. రికార్డుల్లో చిన్న తప్పులున్నా సవరించేందుకు అవకాశం కల్పించామన్నారు. అప్పీలు వ్యవస్థతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. అడిషనల్ కలెక్టర్ డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్ రావు, జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ విశ్వనాథ్ రావు, తహసీల్దార్ అడా బిర్మావ్, ఎంపీడీవో సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
పైలట్ ప్రాజెక్టుగా భీమారం మండలం
భీమారం, కోటపల్లి మండల కేంద్రాల్లోని రైతువేదికలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో కలెక్టర్ కుమార్ దీపక్ పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి చట్టంలోని ప్రతి అంశాన్ని, ప్రతి హక్కును రైతులు పూర్తిగా తెలుసుకోవాలన్నారు. హక్కులు, రికార్డుల్లో తప్పుల సవరణకు అవకాశం కల్పించామని, రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ కు ముందు భూములను పూర్తిస్థాయిలో సర్వే చేసి, మ్యాప్ తయారు చేస్తామని తెలిపారు.
పెండింగ్ సాదాబైనామా దరఖాస్తులను పరిష్కరిస్తామన్నారు. భూ సమస్యల పరిష్కారానికి భీమారం మండలాన్ని పైలట్ ప్రాజెక్ట్ గా ఎంపిక చేసినట్లు చెప్పారు. వచ్చే నెల 2 నుంచి భూ సమస్యల కోసం దరఖాస్తులు సేకరించి తహసీల్దార్ ఆఫీసులో అదనంగా సిబ్బందిని నియమించి సమస్యలను పరిష్కరిస్తామన్నారు. అడిషనల్కలెక్టర్ మోతీలాల్, ఆర్డీవో శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్ తదితరులు పాల్గొన్నారు.