
మెదక్ టౌన్, వెలుగు : జిల్లాలో వందశాతం పోలింగ్ లక్ష్యంగా అధికారులు పనిచేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ ఆవరణలో ఓటరు చైతన్య రథాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో రెండు నియోజకవర్గాల్లో ఓటరు చైతన్య రథం వెళ్తోందని, వంద శాతం ఓటింగ్ లక్ష్యంగా ప్రచారం చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు రమేశ్, వెంకటేశ్వర్లు, డీఎస్వో రాజిరెడ్డి, డీపీఆర్వో ఏడుకొండలు, కళాకారులు పాల్గొన్నారు.
పోలింగ్ నిర్వహణపై అవగాహన సదస్సు
నర్సాపూర్ : నియోజకవర్గ పరిధి లోని ఆఫీసర్లకు పోలింగ్ నిర్వహణపై కలెక్టర్ రాజర్షి షా అవగాహన కల్పించారు. "సెక్టోరియల్ , నోడల్, పోలింగ్ అధికారులకు ఎన్నికల నిర్వహణ" అనే కార్యక్రమాన్ని నిర్వహించి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో తూప్రాన్ , నర్సాపూర్ ఆర్డీఓలు జయచంద్ర , శ్రీనివాసులు పాల్గొన్నారు.
18 ఏళ్లు నిండిన వారు ఓటర్ గా నమోదు చేసుకోవాలి
నిజాంపేట : 18 ఏళ్లు నిండిన వారు ఓటర్ గా నమోదు చేసుకోవాలని, ఈ నెల 31 వరకు అవకాశం ఉందని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. మండల పరిధిలోని నందిగామలో 106, 107 పోలింగ్ స్టేషన్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ని మొత్తం 764 పోలింగ్ స్టేషన్లలో కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు. అధికారులు ప్రజలకు సి విజిల్ యాప్ పై అవగాహన కల్పించాలని సూచించారు. ఆయన వెంట అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, మెదక్ ఆర్డీఓ అంబదాస్, పీఆర్ డీఈ పాండు రంగారెడ్డి, తహసీల్దార్ సురేశ్, ఎంపీడీఓ జగదీశ్వర్, ఏపీఓ రాజేందర్, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.