ఆదిలాబాద్/నిర్మల్/ఆసిఫాబాద్/నస్పూర్, వెలుగు: దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మంగళవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకొన్నారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్‌తో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. దివ్యాంగుల పిల్ల లతో కేక్ కట్ చేయించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాల న్నారు. దివ్యాంగుల కోసం తనవంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇండ్ల కేటాయింపుల్లో దివ్యాంగులకు ప్రాధాన్యత ఇవ్వాలని, స్వయం ఉపాధి పొందేందుకు వీలుగా బ్యాంకులు రుణాలు ఇచ్చేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరారు. వారికి ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు.
పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
దివ్యాంగుల హక్కుల పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. పట్టణంలోని టీఎన్జీవో సంఘ భవనంలో జిల్లా మహిళ, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్ జెండర్ల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవంలో అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, సీనియర్ సివిల్ జడ్జి రాధికతో కలిసి ఆమె పాల్గొన్నారు.
కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా ఉన్న దివ్యాంగులు హాజరయ్యారు. దివ్యాంగుల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ పథకాలను వినియోగించుకొని అన్ని రంగాల్లో రాణించాలని కోరారు. డీఆర్డీవో విజయ లక్ష్మి, డీఎంహెచ్‌వో రాజేందర్, మెప్మా పీడీ సుభాష్, లీడ్ బ్యాంకు మేనేజర్ రాంగోపాల్, డీఎస్పీ ప్రభాకర్, ఏసీడీపీవో నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఆసిఫాబాద్ కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే, అధికారులు పాల్గొన్నారు.
దివ్యాంగుల సంక్షేమం దిశగా చర్యలు
దివ్యాంగుల సంక్షేమం దిశగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. దివ్యాంగుల దినోత్సవాన్ని కలెక్టరేట్లో నిర్వహించారు. జిల్లా సంక్షేమశాఖ అధికారి స్వరూపారాణితో కలిసి కలెక్టర్ పాల్గొని మాట్లాడుతూ.. దివ్యాంగుల పరిరక్షణ హక్కులపపై అవగాహన కలిగి ఉండాలన్నారు. దివ్యాంగులకుట్రై సైకిళ్లు అందిస్తున్నట్లు చెప్పారు. ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దుర్గాప్రసాద్, ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి రవీందర్ రెడ్డి, జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి రాజేశ్వరి, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి గణపతి పాల్గొన్నారు.