బుర్కీ గ్రామాభివృద్ధికి కృషి : కలెక్టర్ రాజర్షి షా

బుర్కీ గ్రామాభివృద్ధికి కృషి : కలెక్టర్ రాజర్షి షా

ఆదిలాబాద్, వెలుగు: గవర్నర్ దత్తత తీసుకున్న బుర్కి గ్రామాభివృద్ధికి కృషి చేస్తామని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. బుధవారం ఆదిలాబాద్ రూరల్ మండలంలోని బుర్కీలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఐటీడీఏ పీవో ఖుష్భు గుప్తాతో కలిసి గ్రామస్తులకు దుప్పట్లు, విద్యార్థులకు యూనిఫామ్​లు పంపిణీ చేశారు. గ్రామంలో ఉన్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

అంకోలి గ్రామం నుంచి బుర్కీ వరకు 6 కిలోమీటర్లు రహదారి నిర్మించనున్నట్లు చెప్పారు. ఈ నిర్మాణ పనులు మార్చి చివరిలోగా పూర్తి చేయాలని ట్రైబల్ వెల్ఫేర్ ఈఈని ఆదేశించారు. సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు రెడ్​క్రాస్ సోసైటీ ముందుకొచ్చిందన్నారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి పిల్లల హాజరు శాతాన్ని, పౌష్టికాహారం అందిస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు.

వైద్యం అందించడంలో నిర్లక్ష్యం వద్దు

రిమ్స్ హాస్పిటల్​కు వచ్చే రోగులకు వైద్యం అందించడంలో నిర్లక్ష్యం చేయొద్దని కలెక్టర్ అన్నారు. బుధవారం సాయంత్రం రిమ్స్ మెడికల్ కాలేజీలో రివ్యూ నిర్వహించారు. గైనకాలజీ డిపార్ట్​మెంట్​లో అన్ని రకాల డెలివరీస్ చేయాలని, రిఫరల్ లేకుండా చూడాలని సూచించారు.

ప్రసూతి కోసం ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లకుండా రిమ్స్​పై నమ్మకం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఎక్స్​రే, ఈసీజీ, స్కానింగ్, రక్త, ఇతర పరీక్షలకు సంబంధించి ప్రొఫెసర్లు ప్రత్యేక శ్రద్ధ వహించా లని ఆదేశించారు. రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, డీఎంహెచ్​వో  నరేందర్ రాథోడ్ పాల్గొన్నారు.