
మెదక్ టౌన్, వెలుగు: జిల్లా వ్యాప్తంగా నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షి షా అన్నారు. శనివారం కలెక్టరేట్లో పలు రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నామినేషన్ల ప్రక్రియను సీసీ కెమెరాల సమక్షంలో నిర్వహించాలని, అభ్యర్థుల వ్యయ వివరాలను పక్కాగా సేకరించాలని సూచించారు.
నామినేషన్ వేసే వారితో పాటు మరో నలుగురిని మాత్రమే అనుమతించాలన్నారు. 11 గంటలకు ముందు, మధ్యాహ్నం 3 గంటల తర్వాత నామినేషన్లు స్వీకరించొద్దని, నామినేషన్ల స్క్రూటీని ఎప్పుడు, ఎక్కడ నిర్వహిస్తారనే సమాచారం అభ్యర్థులకు తెలియజేయాలని తెలిపారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు వెంకటేశ్వర్లు, రమేశ్, డీఆర్వో పద్మశ్రీ, జడ్పీ సీఈవో వెంకట శైలేశ్, ఆర్డీవోలు అంబదాస్ రాజేశ్వర్, జయచంద్ర, శ్రీనివాస్
పాల్గొన్నారు.
వాల్మీకి ఆలోచన విధానం ఎంతో గొప్పది
వాల్మీకి సమాజానికి ఎంతో విలువైన గ్రంథాలను అందించారని.. ఆయన ఆలోచనా విధానం ఎంతో గొప్పదని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహర్షి వాల్మీకి జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి శంకర్, సహాయ అభివృద్ధి అధికారి నాగరాజు గౌడ్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.