
మెదక్ టౌన్, వెలుగు: జిల్లాలోని మెదక్, నర్సాపూర్ సెగ్మెంట్ల కౌంటింగ్‌కు సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. శనివారం హవేళీ ఘనపూర్ మండలంలో ఉన్న వైపీఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో ఏర్పాట్లను పరిశీలించి మాట్లాడారు. మెదక్‌కు సంబంధించి 274 పోలింగ్ కేంద్రాలు,14 టేబుల్స్, 20 రౌండ్స్, నర్సాపూర్‌కు సంబంధించి 305 పోలింగ్ కేంద్రాలు, 14 టేబుల్స్ , 22 రౌండ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
కౌంటింగ్ కేంద్రం వద్ద శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. కౌంటింగ్ కేంద్రంలో విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బంది రాకపోకలకు, అభ్యర్థులు, ఏజెంట్ల రాకపోకల కోసం వేర్వేరు మార్గాలను ఏర్పాటు చేశామన్నారు. తాగునీరు, విద్యుత్ సరఫరా, కౌంటింగ్ టేబుల్స్, ఇతర అన్ని సౌకర్యాలను సిద్దం చేశామన్నారు. ఆయన వెంట అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఆర్వో రాజేశ్వర్, ఎన్నికల అధికారులు, సిబ్బంది ఉన్నారు.
సిద్దిపేట రూరల్: జిల్లా కేంద్రంలోని ఇందూర్ ఇంజనీరింగ్ కాలేజ్ లో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గజ్వేల్ సెగ్మెంట్లో 321 పోలింగ్ కేంద్రాలు, అత్యధికంగా 44 మంది అభ్యర్థులు, 23 రౌండ్లలో ఓట్లను లెక్కించాల్సి ఉందన్నారు.
చివరి రౌండు ఫలితం రాత్రి 8 గంటల తర్వాతనే వస్తుందన్నారు. మిగతా హుస్నాబాద్, సిద్దిపేట, దుబ్బాక సెగ్మెంట్ల ఫలితాలు సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్య వచ్చే అవకాశం ఉందని తెలిపారు. లెక్కింపు ప్రారంభమైన తర్వాత ప్రతిగంటకు రౌండ్ల వారీగా ఓట్ల లెక్కింపు ఫలితాలను ఈసీఐ వెబ్సైట్ ద్వారా ప్రకటిస్తామని చెప్పారు.