
ఆదిలాబాద్, వెలుగు : స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. శుక్రవారం జడ్పీ సమావేశ మందిరంలో రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారుల శిక్షణా కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల నిర్వహణ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించాలని సూచించారు.
.నియమ, నిబంధనలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, ఎలాంటి తప్పిదాలు జరగవద్దన్నారు. ఎన్నికల కమిషన్ ప్రకటనను అసరిస్తూ ఆర్వోలు నోటిఫికేషన్ జారీ చేసి, ఆ రోజు నుంచే సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాల ఎన్నిక కోసం నామినేషన్లు స్వీకరించాల్సి ఉంటుందని తెలిపారు.
బ్యాలెట్ పేపర్ లో అభ్యర్థుల పేర్లను అక్షర క్రమం ఆధారంగా వరుసగా ముద్రించాల్సి ఉంటుందన్నారు. అభ్యర్థులు ఎన్ని సెట్ల నామినేషన్లు సమర్పిస్తే, అన్ని నామినేషన్ల దరఖాస్తులను తప్పనిసరిగా పరిశీలించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ అభీగ్యాన్, జిల్లా పరిషత్ సీఈవో జితేందర్, డీఎల్పీవోఫణీంద్ర, మాస్టర్ ట్రైనర్లు శివ ప్రసాద్, రాజశంకర్, శ్రీహరి బాబురిటర్నింగ్ పాల్గొన్నారు.
ప్రజావాణి విజయవంతమైంది
పైలెట్ ప్రాజెక్టుగా జిల్లాలో చేపట్టిన ప్రజావాణి కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నదని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో పైలెట్ ప్రజావాణి, ప్రజా ఫిర్యాదుల బహిరంగ విచారణ కార్యక్రమంపై స్టేట్ టీమ్ తో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. రాష్ట్రంలో మొదటగా ఆదిలాబాద్ జిల్లాలో జనవరి 27న ప్రారంభించారని తెలిపారు.
మండలం లోని ప్రజావాణి లో ముఖ్యంగా ప్రజాపాలన దరఖాస్తులు గ్యాస్ సబ్సిడీ, గృహజ్యోతి, రుణమాఫీ సమస్యలు, అటవీ హక్కుల సమస్యలు, రేషన్ పెన్షన్ డిలీట్ సమస్యలు పై మండల స్థాయిలో దరఖాస్తుదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించి కొన్ని అక్కడికక్కడే పరిష్కరించడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో కిసాన్ మిత్ర రాష్ట్ర కో ఆర్డినేటర్ హర్ష , కిసాన్ మిత్ర టీమ్, తదితరులు పాల్గొన్నారు.