సాంకేతిక పద్ధతులపై అవగాహన పెంచుకోవాలి : కలెక్టర్ రాజర్షి షా 

సాంకేతిక పద్ధతులపై అవగాహన పెంచుకోవాలి : కలెక్టర్ రాజర్షి షా 

మెదక్, వెలుగు: రైతులు ఆధునిక వ్యవసాయ సాంకేతిక పద్ధతులపై అవగాహన పెంచుకోవాలని కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. కలెక్టరేట్​లోని తన ఛాంబర్ లో బుధవారం అగ్రిటెక్ సౌత్ – 2024 పోస్టర్ ను ఆయన రిలీజ్​చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్​మాట్లాడుతూ.. ఈనెల 16 నుంచి 18 వరకు హైద్రాబాద్​లోని ప్రొఫెసర్ జయశంకర్​యూనివర్సిటీలో భారత పరిశ్రమల సమాఖ్య అగ్రిటెక్ సౌత్- 2024 ఎగ్జిబిషన్ సదస్సు నిర్వహిస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ ఉత్పత్తులు వాటి పెంపకం, పునరుత్పత్తి వ్యవసాయం, పశు సంరక్షణ, చేపల పెంపకం,   కోళ్ల పెంపకం, ఆయిల్ పామ్ సాగు, వ్యవసాయ యాంత్రీకరణ, పోషక భద్రత, ఉద్యాన పంటలు, సమీకృత వ్యవసాయ పద్ధతులు, రైతు ఉత్పావన సంస్థలు, అగ్రి స్టార్టప్ ల గురించి చర్చలు జరుగుతాయన్నారు. మూడు రోజుల పాటు నిర్వహించే ఈ ఎగ్జిబిషన్ లో వెయ్యి మంది వ్యవసాయ సంబంధిత ప్రతినిధులతో చర్చా కార్యక్రమం ఉంటుందని, 150 స్టాల్స్ ద్వారా వివిధ వ్యవసాయ ఉపకరణాల ప్రదర్శన జరుగుతుందన్నారు.

 ఆసక్తి ఉన్న రైతులు పాల్గొనాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్, వ్యవసాయ సహాయ సంచాలకులు వినయ్ కుమార్, రాజ్ నారాయణ పాల్గొన్నారు.