
మెదక్ టౌన్, వెలుగు: ఏడుపాయల జాతరను ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. మార్చి 8, 9, 10 తేదీల్లో జరిగే జాతర ఏర్పాట్లపై శనివారం మెదక్ కలెక్టర్ ఆఫీసులో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ ఏడాది జాతరకు వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుందని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
షిఫ్ట్ ప్రకారం సిబ్బందికి విధులు కేటాయించి, పాసులు జారీ చేయాలన్నారు. బ్యారీ కేడింగ్ పూర్తి చేసి, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని, పారిశుధ్య కార్మికులను నియమించుకోవాలన్నారు. షవర్లు, మంచినీటి నల్లాలు, బాత్రూమ్స్ఏర్పాటు చేసి విద్యుత్‌సరఫరాలో అంతరాయం కలగకుండా చూడాలన్నారు. జిల్లా నలుమూలల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి బస్సులు నడపాలని, గజ ఈతగాళ్లు, వైద్య ఆరోగ్య కేంద్రాల ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు వెంకటేశ్వర్లు, రమేశ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలి
ఎండాకాలంలో జిల్లా వ్యాప్తంగా నీటి ఎద్దడి రాకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఈ విషయంలో అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. శనివారం కలెక్టర్ ఆఫీసులో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వేసవి కాలానికి తాగునీటి కోసం ప్రత్యేక యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని, గ్రామ, మున్సిపల్ జిల్లా వ్యాప్తంగా బోర్‌వెల్స్, పైప్ లైన్ నల్లాలను రిపేర్ చేయించాలని అధికారులను ఆదేశించారు. అడిషనల్ కలెక్టర్ రమేశ్, జడ్పీ సీఈవో ఎల్లయ్య, డీఆర్డీఏ శ్రీనివాస్‌రావు, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ ఎమలాకర్, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఎంపీవోలు, పాల్గొన్నారు.