వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి :కలెక్టర్ రాజర్షి షా 

వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి :కలెక్టర్ రాజర్షి షా 
  • పోషణ్ అభియాన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి : కలెక్టర్ రాజర్షి షా 

ఆదిలాబాద్, వెలుగు: సీజనల్ వ్యాధులపై వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. గురువారం బేల మండలం సైద్ పూర్ పీహెచ్‌సీని  సందర్శించారు. మెడిసిన్ స్టాక్ రూమ్, వ్యాక్సిన్ స్టోరేజ్ రూమ్ లను తనిఖీ చేశారు. చిన్నుగూడ అంగన్వాడీ కేంద్రం తనిఖీ చేసి రిజిస్టర్లను, మధ్యాహ్నం భోజనం తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు.

పోషణ అభియాన్ కార్యక్రమంలో భాగంగా పోషణ మాసం 5 వ రోజు చిన్నుగూడలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం బేల గ్రామ పంచాయతీ ఆఫీస్ ను సందర్శించి ఓటరు నమోదు ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మాతా, శిశు సంపూర్ణ ఆరోగ్య రక్షణే లక్ష్యంగా ఏటా పోషణ్‌ అభియాన్‌ పేరిట మాసోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

 అంగన్వాడీ కేంద్రంలో ఇస్తున్న పౌష్టికాహారం, బాలమృతం, మధ్యాహ్నం భోజనం ప్రతీ రోజు తీసుకోవాలని, తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే ఇక్కడ ఇస్తున్న ఐరన్ మాత్రలు తప్పనిసరిగా వేసుకోవాలని సూచించారు. చిన్నారుల ఆరోగ్య పరిస్థి తులపై అధికారులు, ఐసీడీఎస్‌సిబ్బంది అవగాహన కల్పిస్తారని, వివిధ శాఖల సమన్వయంతో పోషకాహారంపై అవగాహన, చిన్నారులకు అన్నప్రాసన, సీమంతాలు, అక్షరాభ్యాసం, గర్భిణుల నమోదు తోపాటు పరీక్షలు, వైద్య శిబిరాల నిర్వహణ వంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు.