ఆదిలాబాద్, వెలుగు: భీంపూర్ మండలంలోని ఇందూర్ ను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. గురువారం ఇందూర్ గ్రామంలో పర్యటించిన కలెక్టర్ ఇండియన్ డెంటల్ అసోషియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గ్రామస్తులకు రగ్గులు, స్వెట్టర్లు అందజేశారు. అనంతరం అంగన్వాడీ చిన్నారులకు యూనిఫామ్లు పంపిణీ చేశారు.
జిల్లాలో చలి తీవ్రత అధికంగా ఉందని, ఉత్తరాది నుంచి వీస్తున్న చలిగాలులతో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో వృద్ధులు, పిల్లలు జాగ్రత్తగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించారు. శీతాకాలం లో వచ్చే ఆనారోగ్య సమస్యల నుంచి రక్షించుకోవాలన్నారు. గ్రామాల్లో ఉన్న సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని, సమస్యలపై ప్రతిపాదనలు పంపాలని ఎంపీడీవోను ఆదేశించారు. డీఎంహెచ్వో నరేందర్, ఇండియన్ డెంటల్ అసోసియేషన్ అధ్యక్షుడు సమీయుద్దీన్, మాజీ జడ్పీటీసీ సుధాకర్ తదితరులు ఉన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల పరిశీలన
భీంపూర్ మండలంలోని ఆర్లి టీ, నిపాని గ్రామాల్లో జరుగుతున్న ఇందిరమ్మ ఇండ్ల సర్వేను కలెక్టర్ పరిశీలించారు. అర్లి టీలోని గ్రంథాలయ కార్యాలయాన్ని ప్రారంభించారు. విద్యార్థులతో మాట్లాడుతూ పుస్తక పఠనాన్ని పెంచుకోవాలని, తద్వారా ఊహాశక్తి, సృజనాత్మకత పెరుగుతుందని అన్నారు.