
నేరడిగొండ, వెలుగు: నేరడిగొండ మండలంలోని కుంటాల జలపాతాన్ని కలెక్టర్ రాజర్షి షా, జిల్లా అటవీ శాఖ అధికారి ప్రశాంత్ బుధవారం సందర్శించారు. వ్యూ పాయింట్ వద్దకు వెళ్లి జలపాతం అందాలను తిలకించారు. ఈ జలపాతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దే అంశాలపై చర్చించారు. టూరిజం పాయింట్, హరిత రిసార్ట్, కాంపౌండ్ వాల్, కాటేజెస్ కోసం స్థల సేకరణ కోసం అటవీశాఖ అధికారులతో కలిసి పరిశీలించారు.
రోడ్ వేపై చర్చించి పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. హరిత హోటల్ నిర్మించడానికి స్థలాన్ని పరిశీలించారు. కలెక్టర్వెంట ఆర్డీవో వినోద్ కుమార్, ట్రైబల్ ఈఈ భీమ్ రావు, ఆర్ అండ్ బీ అధికారి నర్సయ్య, ఎఫ్ ఆర్ వో గణేశ్, ఎఫ్ బీఓ భీమ్ జీ, తహసీల్దార్ సంతోశ్ రెడ్డి తదితరులున్నారు.