
మెదక్ టౌన్, వెలుగు: ప్రజావాణి వచ్చే ఫిర్యాదులపై అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. సోమవారం మెదక్ కలెక్టర్ ఆఫీసులో అడిషనల్ కలెక్టర్ రమేశ్ తో కలిసి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణి కార్యక్రమంలో తమకు న్యాయం జరుగుతుందనే నమ్మకంతో ప్రజలు వస్తుంటారని వారిని ఇబ్బందులకు గురిచేయకుండా అధికారులు సమస్యను పరిష్కరించాలని సూచించారు. ఈ సందర్భంగా మొత్తం 69 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. ఇందులో ఎక్కువగా డబుల్ బెడ్రూం, భూ సమస్యలు, పింఛన్ బాధితులు ఉన్నారన్నారు.
సిద్దిపేటలో..
సిద్దిపేట టౌన్: ప్రజావాణికి వచ్చే సమస్యలకు ప్రాధాన్యం ఇవ్వాలని అడిషనల్కలెక్టర్ గరిమా అగర్వాల్అధికారులను ఆదేశించారు. సోమవారం సిద్దిపేట కలెక్టర్ఆఫీసులో అధికారులతో కలిసి బాధితుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా జస్టిస్ పున్నయ్య ఏకసభ్య కమిషన్ సిఫార్స్ మేరకు ప్రతీ నెల చివరన పౌర హక్కుల దినోత్సవం తప్పకుండా జరపాలని జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు శంకర్ వినతి పత్రం అందించారు.
పిల్లలను ఇబ్బందిపెడుతున్న వర్గల్ ఎస్సీ హాస్టల్ వార్డెన్ ను సస్పెండ్ చేయాలని డీబీఎఫ్నాయకులు శంకర్ , భీమ్ శేఖర్ అడిషనల్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. భూమిలేని దళితులకు భూ పంపిణీ చేయాలని తోగుట మండలం బండారు పల్లికి చెందిన దళితులు వినతిపత్రం సమర్పించారు. మొత్తం 23 ఫిర్యాదులు అందాయని అడిషనల్ కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో డీఆర్వో నాగ రాజమ్మ, డీఆర్డీఏపీడీ జయదేవ్ ఆర్యా, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
సంగారెడ్డిలో..
సంగారెడ్డి టౌన్: ప్రజావాణికి వచ్చిన అప్లికేషన్లను ఆయా శాఖల అధికారులు త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి సూచించారు. సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్ గ్రీవెన్స్ హాల్లో అర్జీదారుల నుంచి అప్లికేషన్లు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణికి 65 అప్లికేషన్లు రాగా ఇందులో రెవెన్యూ శాఖకు సంబంధించి 18, ఇతర శాఖలకు సంబంధించి 47 అప్లికేషన్లు వచ్చాయని తెలిపారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.