నిజామాబాద్, వెలుగు : జిల్లా పరిధిలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు తెలిపారు. మొత్తం 13,89,291 ఓటర్ల కోసం 1,549 పోలింగ్ సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. బుధవారం ఆయన తన ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడారు. 80 ఏండ్లు దాటిన సీనియర్ సిటిజన్స్17,580 ఉండగా, 40 శాతం వైకల్యం ఉన్న దివ్యాంగులు 23,919 ఉన్నారన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఫారం–12 (డి) అందించిన వారికి ఇంటి నుంచి ఓటేసే సౌకర్యం కల్పిస్తామన్నారు. వీడియో షూటింగ్మధ్య పారదర్శకంగా వారు ఓట్లు వేస్తారన్నారు. పోస్టల్ బ్యాలెట్ కోరిన ఓటర్లను పోలింగ్సెంటర్లలోకి అనుమతించరన్నారు. 1,778 పోలింగ్ ఆఫీసర్లు, 1,774 ఏపీవోలు, 3,599 సహాయకులు ఎన్నికల కోసం పనిచేస్తున్నారన్నారు.
also read : పార్టీ మారటం లేదు.. నామినేషన్ నేనే వేస్తున్నా : అద్దంకి దయాకర్
69 రివాల్వర్ల డిపాజిట్ : సీపీ
జిల్లాలో 69 లైసెన్స్ రివాల్వర్లను డిపాజిట్ చేయించామని సీపీ కల్మేశ్వర్ సింగెనవార్ తెలిపారు. 260 మంది రౌడీషీటర్లు, 41 కమ్యూనల్ రౌడీలను బైండోవర్ చేశామన్నారు. 2018, 19 ఎన్నికల్లో కేసులు నమోదైన 450 మందిని సైతం బైండోవర్చేశామన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించామని అక్కడ అదనపు బందోబస్తు కల్పిస్తామన్నారు. జిల్లాకు తొమ్మిది కంపెనీల కేంద్ర బలగాలను కేటాయించారన్నారు. ఎన్నికల అడిషనల్కలెక్టర్ యాదిరెడ్డి, డీసీపీ జయరాం ఉన్నారు.