
- కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు
నందిపేట, వెలుగు: విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యతతో కూడిన పౌష్టికాహారం అందజేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు అన్నారు. మంగళవారం డొంకేశ్వర్ మండలంలోని నూత్పల్లి మహాత్మాజ్యోతిబాపూలే గురుకుల పాఠశాల, తొండాకూర్ జడ్పీహెచ్ఎస్, ఎంపీపీఎస్ పాఠశాలలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. నూత్‌పల్లిలో వండిన భోజనాన్ని పరిశీలించారు. స్టోర్ రూంలో బియ్యం నిల్వలు, కూరగాయలు, ఇతర ఆహార పదార్థాలను తనిఖీ చేశారు. బియ్యం నాసిరకంగా ఉండండతో పాటు బస్తాలకు ట్యాగ్‌లు లేకుండా చిరిగిపోయి కనిపించడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు.
మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పరీక్షలు సమీపిస్తున్నందున సకాలంలో సిలబస్ పూర్తిచేసి పున:శ్చరణ తరగతులు నిర్వహించాలని ప్రిన్సిపల్ లక్ష్మణ్ కు సూచించారు. తొండకూర్‌లో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఆహారం కలుషితం కాకుండా జాగ్రత్తలు వహించాలని నిర్వాహకులకు సూచించారు. అంతకు ముందు నందిపేట పీహెచ్‌సీని ఆయన తనిఖీ చేశారు. ల్యాబ్, ఐఎల్‌ఆర్‌లను పరిశీలించి స్థానికంగా ఉంటూ రోగులకు సేవలు అందించాలని వైద్యులకు, సిబ్బందికి సూచించారు. ఆయన వెంట తహసీల్దార్ ఆనంద్‌కుమార్, ఎంపీఓ లక్ష్మీప్రసాద్ ఉన్నారు.