ఆర్మూర్, వెలుగు : ధరణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు అధికారులను ఆదేశించారు. ఆర్మూర్ తహసీల్దార్ ఆఫీస్‌ను గురువారం ఆయన సందర్శించారు. ధరణి దరఖాస్తులు పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆర్మూర్ మండలంలో ఆయా మాడ్యూల్స్ లో పెండింగ్ లో ఉన్న ధరణి దరఖాస్తులు ఎన్ని, వాటి పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారనే విషయమై ఆరా తీశారు.
ఎక్కువ సంఖ్యలో ధరణి దరఖాస్తులు పెండింగ్ లో ఉండడంపై అసహనం వ్యక్తం చేశారు. ఫీల్డ్ లెవల్ లో ఎంక్వైరీ చేసి రికార్డుల ఆధారంగా దరఖాస్తులను పరిష్కరించేందుకు చొరవ చూపాలని ఆదేశించారు. అవకతకలకు ఆస్కారం లేకుండా నివేదికను ఆర్డీవో లాగిన్ కు ఫార్వార్డ్ చేయాలని సూచించారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ ఆర్డీవో రాజాగౌడ్ ఉన్నారు.
ALSO Read : సాగుభూమికే రైతుబంధు ఇవ్వాలి : డీసీవో శ్రీనివాసరావు
ఈవీఎం గోడౌన్ పరిశీలన
నిజామాబాద్ సిటీ : జిల్లా కేంద్రంలోని వినాయకనగర్ ఈవీఎం గోడౌన్ ను కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు గురువారం సందర్శించారు. త్రైమాసిక తనిఖీలలో భాగంగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం గోడౌన్ ను తెరిపించి, బ్యాలెట్ యూనిట్ లు, ఎన్నికల సామగ్రిని భద్రపరిచిన గదులను పరిశీలించారు. కలెక్టర్ వెంట ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు పవన్, సాత్విక్, సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు.