
నిజామాబాద్, వెలుగు: జిల్లాలో ఎక్కడా నకిలీ విత్తనాలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు తెలిపారు. గట్టి నిఘా ఏర్పాటు చేశామని నకిలీ, నాసిరకం సీడ్‌పై రైతులకు అగ్రికల్చర్ ఆఫీసర్లతో అవగాహన కల్పిస్తున్నట్లు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రెవెన్యూ, పోలీస్, అగ్రికల్చర్ ఆఫీసర్లతో కూడిన మండల కమిటీలు తనిఖీలు చేస్తున్నాయన్నారు. ఆర్మూర్ మండలం సుబ్బిర్యాల్ విలేజ్‌లో అనధికారికంగా నిలువ ఉంచిన 5,540 కిలోల వరి విత్తనం, 360 కిలోల మొక్కజొన్న, 810 కిలోల సోయాబీన్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు.
రూ.14,825 విలువైన గడువు దాటిన ఉల్లి, వెజిటెబుల్సీడ్ను ఆర్మూర్‌లోని బాలాజీ సీడ్స్నుంచి స్వాధీనం చేసుకొని కేసులు నమోదు చేశామన్నారు. అనుమతించిన డీలర్ల నుంచి మాత్రమే రైతులు విత్తనం కొనుగోలు చేయాలని తప్పక రశీదులు తీసుకోవాలన్నారు. రశీదుపై రైతు పేరు, పంట పేరు, సీడ్వెరైటీ, లాట్‌నంబర్ తదితర వివరాలు తప్పక రాయించాలన్నారు. పంట కోతలు ముగిసేదాకా రశీదుతో పాటు ఖాళీ సీడ్ బ్యాగ్‌ను భద్రంగా పెట్టుకోవాలన్నారు. విత్తన లోపంతో రైతుకు నష్టం జరిగితే వీటిని సాక్ష్యంగా ఉపయోగించే వీలుంటుందన్నారు.