విశ్వకర్మ స్కీమ్‌పై అవగాహన పెంచుకోవాలి : రాజీవ్‌ గాంధీ హనుమంతు

విశ్వకర్మ స్కీమ్‌పై అవగాహన పెంచుకోవాలి : రాజీవ్‌ గాంధీ హనుమంతు

నిజామాబాద్‌ సిటీ, వెలుగు : చేతి వృత్తులను బలోపేతం చేయడంలో భాగంగా కేంద్రం చేపట్టిన విశ్వకర్మ పథకంపై అవగాహన పెంచుకోవాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లో జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు.  అర్హులైన వారందరూ ఈ పథకాన్ని వినియోగించుకోవాలని తెలిపారు.

అనంతరం ఆన్‌లైన్‌లో అప్లికేషన్‌ విధానాన్ని వివరించారు. ఇతరులపై ఆధారపడకుండా స్వయం ఉపాధి పొందాలనుకునే వారికి ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. అర్హులైన వారిని ఎంపిక చేసి ట్రైనింగ్‌ ఇవ్వనున్నట్లు తెలిపారు. ట్రైనింగ్‌ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్‌, ఐడీ కార్డుతో పాటు టూల్స్‌ కోసం రూ. 15 వేలు ఆర్థికసాయం అందజేస్తామని చెప్పారు.

తయారుచేసిన వస్తువులకు మార్కెటింగ్‌ కల్పించేందుకు ఎంఎస్‌ఎంఈ కృషి చేస్తోందన్నారు. సదస్సులో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్‌ మేనేజర్‌ సురేశ్‌ కుమార్‌, ఆఫీసర్లు రాజేశ్‌ యాదవ్‌, రమేశ్‌, ఎస్.సిద్దయ్య పాల్గొన్నారు.