మాక్లూర్, వెలుగు : కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన రైతులకు ఎప్పటికప్పుడు బిల్లుల చెల్లించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. మాక్లూర్ మండలం ఒడ్డాట్ పల్లిలోని కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. ఇప్పటివరకు సేకరించిన ధాన్యం ఎంత, రైస్ మిల్లులకు ఎంత పరిమాణంలో రవాణా చేశారు, బిల్లుల చెల్లింపులు ఏ మేరకు జరిగాయి తదితర వివరాలను నిర్వాహకులకు అడిగి తెలుసుకున్నారు.
కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం తరలించిన తర్వాత రైస్ మిల్లుల వద్ద ఎక్కడైనా తరుగు, కడ్తా పేరిట కోతలు అమలు చేస్తున్నారా అని రైతులను ఆరా తీశారు. ఏఈవో ధ్రువీకరణ పత్రాన్ని జతపరుస్తూ, ఆన్లైన్ లో సన్న వడ్ల వివరాలను ప్రత్యేకంగా నమోదు చేయాలన్నారు. సరిపోను గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచాలని చెప్పారు. కలెక్టర్ వెంట డీసీవో శ్రీనివాస్, తహసీల్దార్ శేఖర్ ఉన్నారు.