
వెలుగు నెట్ వర్క్: అర్జీల పరిష్కారంపై నిర్లక్ష్యం తగదని కలెక్టర్లు ఆఫీసర్లను హెచ్చరించారు. సోమవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కలెక్టరేట్లలో గ్రీవెన్స్ సెల్ నిర్వహించారు. హనుమకొండలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బాధితుల నుంచి అర్జీలు తీసుకున్నారు. మొత్తం 71 అప్లికేషన్లు రాగా.. వాటిని ఆయా శాఖలకు అందజేశారు. వారం రోజుల్లో సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. వరంగల్ బల్దియాలో అడిషనల్ కమిషనర్ రవీందర్ యాదవ్, డిప్యూటీ కమిషనర్ అసినుర్ రషీద్ హాజరై 64 వినతులు స్వీకరించారు.
భూముల ఫిర్యాదులు ఎక్కువొస్తున్నయ్..
గ్రీవెన్స్‌లో భూములకు సంబంధించిన ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని..అధికారులు చిత్తశుద్ధితో వాటిని క్లియర్ చేయాలని వరంగల్ కలెక్టర్ గోపి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ గ్రీవెన్స్ లో ఆయన బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. స్వయం ఉపాధికి సంబంధించిన అప్లికేషన్లను పరిశీలించి, వాటికి వర్తించే పథకాల్లో లబ్ధిదారులుగా చేర్చాలన్నారు. ఈ ప్రజావాణిలో మొత్తం 35 దరఖాస్తులు రాగా అందులో భూసమస్యలు 14, ల్యాండ్ సీలింగ్ 2 వచ్చినట్లు తెలిపారు. మహబూబాబాద్ కలెక్టరేట్లో కలెక్టర్ శశాంక గ్రీవెన్స్ సెల్ నిర్వహించి 111 అర్జీలు స్వీకరించారు. కాగా, ఖానాపురం గ్రామ పంచాయతీకి చెందిన గీత కార్మికులు పెద్ద ఎత్తున ధర్నా చేశారు. అక్రమంగా తాటిచెట్లను కూల్చిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జనగామ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ శివలింగయ్య హాజరై అర్జీలు తీసుకున్నారు. మొత్తం 44 విజ్ఞప్తులు వచ్చాయి.ములుగు కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్ లో కలెక్టర్ కృష్ణ ఆదిత్య బాధితుల గోడు విన్నారు. ఇందులో మొత్తం 33 అప్లికేషన్లు వచ్చాయి. జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా.. ఆయా కలెక్టరేట్లలో ఆఫీసర్లతో ఐక్యతా ప్రతిజ్ఞ చేశారు.
కౌన్సిల్‍ను రద్దు చేయాలి
వరంగల్, వెలుగు: గ్రేటర్ వరంగల్ డెవలప్‍మెంట్ కోసం సీఎం కేసీఆర్ ప్రకటించిన ఏటా రూ.300 కోట్ల ఫండ్స్ పై తీర్మానం చేయని కౌన్సిల్‍ను వెంటనే రద్దు చేయాలని.. టీడీపీ బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి చీకటి రాజు కోరారు. ఈ అంశమై సోమవారం గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ గ్రీవెన్స్ లో కమిషనర్‍కు వినతిపత్రం అందించారు. సిటీ అభివృద్ధికి రూ.300 కోట్ల చొప్పున ప్రత్యేక నిధులు ఇస్తామని సీఎం కేసీఆర్... ఐదేండ్ల కింద ప్రకటించారన్నారు. సర్కారు పెద్దల హామీ ప్రకారం ఫండ్స్ విడుదల చేయాలంటూ అప్పటి, ఇప్పటి కౌన్సిల్ సభ్యులు సభలో తీర్మానం చేయలేదన్నారు. కమిషనర్ తన విశిష్ట అధికారాల్ని వినియోగించి కౌన్సిల్ కార్యవర్గాన్నిరద్దు చేయాలని వినతిపత్రంలో కోరారు.