అంతరాష్ట్ర చెక్​పోస్టులు ఏర్పాటు : రాజీవ్​గాంధీ హన్మంతు

బోధన్​,వెలుగు: తెలంగాణ,-మహారాష్ట్ర బార్డర్​లోని సాలూరా చెక్​పోస్టును బుధవారం  కలెక్టర్​  రాజీవ్​గాంధీ హన్మంతు, సీపీ  సత్యానారయణ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ ఎన్నికల కోడ్​ అమలులోకి  రావడంతో సరిహద్దులోని పోతంగల్, సాలూర, ఖండ్ గావ్​, కందకుర్తి ప్రాంతాలలో అంతరాష్ట్ర చెక్​పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. చెక్​పోస్టుల గుండా వెళ్లే ప్రతి వాహనాన్ని క్షణంగా తనిఖీ చేస్తామన్నారు.

జిల్లాలో కూడా నిరంతరంగా వాహనాలు తనిఖీలు నిర్వహిస్తామన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా క్యాష్, మద్యం తీసుకవెళ్లితే సీజ్​ చేస్తామన్నారు. జిల్లా  వ్యాప్తంగా పోలీసు, రెవెన్యూ, ఎక్సైజ్​, అటవీశాఖల ఆధ్వర్యంలో ప్రతి మండలానికి ఫ్లయింగ్​ స్కాడ్​ను నియమించామన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. తనిఖీల్లో సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నారు. తనిఖీలకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఆర్డీవో  రాజాగౌడ్​, ఏసీపీ కిరణ్​కుమార్, అధికారులు ఉన్నారు.