నిజామాబాద్​ జిల్లాలో సాగునీటి సమస్య రావద్దు : కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు

నిజామాబాద్​ జిల్లాలో సాగునీటి సమస్య రావద్దు : కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు
  • సంబంధిత అధికారులు బాధ్యతగా పని చేయండి
  • నిర్లక్ష్యం చేస్తే  కఠిన చర్యలు 
  • అధికారుల సమీక్షలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు 

బోధన్​, వెలుగు : నిజామాబాద్​ జిల్లాలో ఎక్కడైనా సాగు నీటి సమస్య తలెత్తితే సంబంధిత అధికారులను బాధ్యులుగా పరిగణిస్తామని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు హెచ్చరించారు. శనివారం బోధన్ పట్టణంలోని నీటిపారుదల శాఖ అతిథి గృహంలో సబ్ కలెక్టర్ వికాస్ మహతో కలిసి ఇరిగేషన్, రెవెన్యూ, వ్యవసాయ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.  

వివిధ ప్రాజెక్టులు, చెరువులు, కాల్వల కింద ఆయకట్టు  పంటల పరిస్థితి, అందుబాటులో ఉన్న సాగునీటి వనరుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.  గతేడాదితో పోలిస్తే ప్రధాన జలాశయాలైన శ్రీరాంసాగర్, నిజాంసాగర్ లతో పాటు చెరువులలో నీటి నిల్వలు ఈసారి ఒకింత ఎక్కువ మొత్తంలోనే అందుబాటులో ఉన్నాయన్నారు.  ఎగువ ప్రాంతాల్లో నీటి చౌర్యం జరుగకుండా నిఘా పెట్టాలన్నారు.  ఏమైనా సమస్య ఉంటే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు.  వేసవి కాలంలో సాగునీరు వినియోగం ఎక్కువగా ఉంటుంది కాబట్టి,  సాగునీటి పంపిణీ వ్యవస్థపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలన్నారు.  

ఎరువుల కొరత లేకుండా చూడాలి

యాసంగి సీజన్ లో ఎరువుల కొరత రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.  గతేడాది రబీ సీజన్​లో 63 వేల మెట్రిక్ టన్నుల ఎరువులను వినియోగించగా, ఈసారి 77 వేల మెట్రిక్ టన్నులకు ఎరువుల డిమాండ్ పెరిగిందన్నారు. 

పన్ను వసూళ్లను వేగవంతం చేయాలి 

ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు చేరుకున్న దృష్ట్యా పన్ను వసూళ్లను వేగవంతం చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత అధికారులకు సూచించారు.  ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలతో పాటు ఇతర సంస్థల నుంచి రావాల్సిన ఆస్తి పన్ను వసూలు చేసేలా స్పెషల్ డ్రైవ్  నిర్వహించాలన్నారు.   

 సాలూర పీహెచ్​సీ తనిఖీ..

 సాలూర మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. దవాఖానలో రోగులకు అందిస్తున్న వైద్య సేవల తీరును పరిశీలించారు.  వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలన్నారు. శిథిలావస్థకు చేరిన పీహెచ్​సీ పాత భవనాన్ని పరిశీలించారు.  కలెక్టర్ వెంట మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాజ్ కుమార్ తదితరులు ఉన్నారు.