
నిజామాబాద్, వెలుగు : జిల్లాలో నాన్ లేఅవుట్ ప్లాట్ల రెగ్యులైజేషన్పై ఫోకస్ పెట్టాలని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు కోరారు. మార్చి 31లోపు ఇంటి జాగలు రెగ్యులరైజ్ చేసుకునే వారికి ఫీజులో 25 శాతం రాయితీ ఉన్నట్లు ప్రచారం చేయాలన్నారు. శుక్రవారం ఆయన తన ఛాంబర్లో జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు.
ఎల్ఆర్ఎస్ కోసం కొత్త అప్లికేషన్లు తీసుకోవాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయన్నారు. సందేహాలు తీర్చడానికి ఇందూర్, బోధన్, ఆర్మూర్, భీంగల్ మున్సిపల్ ఆఫీస్‌లలో హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయాలన్నారు. కలెక్టరేట్లో 08462-220183 కంట్రోల్ రూమ్ అందుబాటులోకి తెస్తున్నామన్నారు. 2020 ఆగస్టు 26లోపు దరఖాస్తు చేసుకున్న వారికే ఇప్పటిదాకా ఎల్ఆర్ఎస్ స్కీమ్ ఇంప్లిమెంట్ అయిందని, ఇక కొత్త అప్లికేషన్లకు గవర్నమెంట్ చాన్స్ ఇచ్చిందన్నారు.
పాత దరఖాస్తులను నిబంధనలకు లోబడి త్వరగా పరిష్కరించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్‌కుమార్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, నగర పాలక కమిషనర్ దిలీప్‌కుమార్, ఆర్డీవో రాజేంద్రకుమార్ తదితరులు ఉన్నారు. అంతకు ముందు స్టేట్ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి నిర్వహించిన వీసీలో కలెక్టర్ పాల్గొన్నారు.