
ఆర్మూర్, వెలుగు : భూ వివాదాలకు ఆస్కారం లేకుండా ఆధార్ తరహాలోనే భూ కమతాలకు భూధార్ నంబర్లను కేటాయించడం జరుగుతుందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమతు తెలిపారు. శనివారం ఆర్మూర్, మాక్లూర్, నందిపేట మండలాల్లో భూభారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ‘భూభారతి’ ప్రయోజనాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ధరణితో పోలిస్తే, ‘భూభారతి’లో అనేక కొత్త అంశాలను పొందుపర్చారన్నారు. భూధార్ నంబర్ కేటాయిపుతో భూ ఆక్రమణలు, వివాదాలకు తావులేదని, రైతులకు పూర్తి భరోసా లభిస్తుందని చెప్పారు.
ఈ చట్టం అమలులోకి వచ్చిన నాటి నుంచి ఏడాది లోపు దరఖాస్తు చేసుకోవాలని రైతులకు సూచించారు. తహసీల్దార్, ఆర్డీవో స్థాయిలో దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించడం జరుగుతుందన్నారు. మే, జూన్ నెలల్లో గ్రామాల వారీగా అధికారులు రెవెన్యూ సదస్సులు నిర్వహించి, రైతుల నుంచి అప్లికేషన్లు స్వీకరిస్తారని తెలిపారు. భూభారతి పోర్టల్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని, రైతులిచ్చిన అర్జీలను 60 రోజుల వ్యవధిలో పరిష్కరిస్తారని పేర్కొన్నారు. ఈ చట్టంలో రెండంచెల అప్పీలు వ్యవస్థ ఉందన్నారు. అప్పీలు చేసుకున్న చిన్న, సన్నకారు, పేద వర్గాల వారికి ఉచిత న్యాయ సేవలు అందించనున్నట్లు తెలిపారు.
గతంలో రికార్డులు చూసి రిజిస్ట్రేషన్లు చేసేవారని, కొత్త ఆర్వోఆర్ చట్టం లో ఫీల్డ్ లెవల్ లో పరిశీలించి, సమగ్ర విచారణ తర్వాతే రిజిస్ట్రేషన్లు చేస్తారన్నారు. పట్టాదారు పాసు పుస్తకాల్లో సమగ్ర వివరాలతో హద్దులను పేర్కొంటూ భూమి పటం (మ్యాపు) పొందుపరుస్తారని వివరించారు. సుదీర్ఘ కాలంగా సుమారు 9 లక్షల సాదాబైనామా పెండింగ్దరఖాస్తులకు భూభారతి చట్టం ద్వారా క్రమబద్ధీకరించుకునే అవకాశం ఏర్పడిందని, హై కోర్టు స్టే ఉత్తర్వులు పోగానే వీటిని క్రమబద్ధీకరించేలా ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేయనుందన్నారు. ప్రతీ సంవత్సరం డిసెంబర్ 31న రికార్డుల ఆధునికీకరణ చేస్తారన్నారు.
అడిషనల్ కలెక్టర్ నీతు కిరణ్ మాట్లాడుతూ 17 రాష్ట్రాల్లో నిపుణులు సమగ్ర అధ్యయనం చేసి, అన్ని రకాల భూ సమస్యల పరిష్కారానికి ఉపయుక్తంగా ఉండేలా ప్రభుత్వం భుభారతి నూతన చట్టం రూపొందించిందని తెలిపారు. అనంతరం రైతుల నుంచి సలహాలు, సూచనలు, ఫిర్యాదులు స్వీకరించారు. కార్యక్రమంలో నిజామాబాద్ ఇన్చార్జి ఆర్డీవో స్రవంతి, ఆర్మూర్ ఆర్డీవో రాజా గౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబాగౌడ్, వైస్ చైర్మన్ విట్టం జీవన్ తదితరులు పాల్గొన్నారు.