నిజామాబాద్/ ధర్పల్లి వెలుగు : సర్కారు హాస్టల్స్, స్కూల్స్ పిల్లల భోజనాల విషయంలో ఎక్కడా రాజీపడమని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు అన్నారు. వంటలు చేయడానికి ముందే కూరగాయలు, వంట సరుకుల నాణ్యత పరిశీలించాలన్నారు. మంగళవారం ఆయన ధర్పల్లి మండల కేంద్రంలోని ప్రైమరీ, హైస్కూల్‌ను సందర్శించి మాట్లాడారు.
భోజనాలను ప్రతీరోజూ తనిఖీ చేయాలని, టీచర్లు వంతుల వారీగా ఈ బాధ్యతలు నిర్వర్తించాలని ఆదేశించారు. బియ్యం, కూరగాయలు, వంట సరుకులు క్వాలిటీగా లేకుంటే తహసీల్దార్లకు తెలపాలన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల నుంచి కొత్త ప్రతిపాదనలు ఉంటే పంపాలన్నారు.
ధాన్యం కొనుగోలైన వెంటనే చెల్లింపులు
ప్రభుత్వం ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మిన వెంటనే రైతుల వివరాలు ట్యాబ్‌లో ఎంట్రీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ధర్పల్లి మండలంలోని రామడుగు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులతో మాట్లాడారు. ఇప్పటి వరకు సేకరించిన ధాన్యానికి బోనస్‌తో సహా చెల్లించామన్నారు.