మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని కలెక్టర్ రవి నాయక్ పిలులుపునిచ్చారు. శుక్రవారం ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా జనరల్ ఆసుపత్రి, బ్లడ్ బ్యాంక్ ఆద్వర్యంలో పాత పాలమూరులో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని కలెక్టర్ ప్రారంబించారు. యూత్ కాంగ్రెస్ నాయకులు భరత్ ఆధ్వర్యంలో యువకులు రక్తదానం చేశారు. డీఎంహెచ్వో కృష్ణ, ఆసుపత్రి సూపరింటెండెంట్ జీవన్, ప్రోగ్రాం ఆఫీసర్ భాస్కర్ నాయక్, డీఎల్వో జరీనా, ఆర్ఎంవో శిరీష, నావల్ కిశోర్, మధుసూదన్ రెడ్డి, నాగరాజు పాల్గొన్నారు.
నాగర్ కర్నూల్ టౌన్: జిల్లా వ్యాప్తంగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి జిల్లా ఆసుపత్రిలో రక్త నిల్వలను పెంచుకోవాలని కలెక్టర్ ఉదయ్ కుమార్ సూచించారు. శుక్రవారం నాగర్ కర్నూల్ గవర్నమెంట్ హాస్పిటల్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రక్త నిల్వలు చాలా తక్కువగా ఉన్నాయని, రక్తదానం చేయడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు.
40 సార్లు రక్తదానం చేసిన శ్రీనును సన్మానించారు. రక్తదానం చేసిన వారికి సర్టిఫికెట్లు అందజేశారు. అనంతరం ఆసుపత్రిలో సమస్యలు అడిగి తెలుసుకున్నారు. డీఎంహెచ్వో సుధాకర్ లాల్, ఆసుపత్రి సూపరింటెండెంట్ రఘు, బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ రోహిత్ పాల్గొన్నారు.