- జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
జనగామ, వెలుగు: పదో తరగతి ఫలితాలపై ప్రత్యేక దృష్టి పెట్టి వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో గురువారం ఆయన అడిషనల్ కలెక్టర్ పింకేష్ కుమార్‌తో కలిసి ఎంఈఓలు, వసతి గృహాల వార్డెన్లు, ప్రధానోపాధ్యాయులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. స్టడీ అవర్స్ లో అన్ని సబ్జెక్టులపై పూర్తి స్థాయిలో సాధన చేయించాలని, ప్రతిరోజూ స్లిప్ టెస్ట్ లు నిర్వహించాలన్నారు.
చదువులో వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించి మ్యాథ్స్, హిందీ తెలుగు సబ్జెక్టుల్లో రాణించేందుకు కృషి చేయాలన్నారు. ఈ నెల 14 న సంక్షేమ గృహాలు, పాఠశాలల్లో 40 శాతం డైట్, కాస్మోటిక్స్ చార్జీల పెంపు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని అన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి రమేశ్ బీసీ వెల్ఫేర్ అధికారి రవీందర్, సంక్షేమ పాఠశాలల అధికారి విక్రమ్, వార్డెన్లు, ఎంఈఓలు, హెడ్ మాస్టర్లు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల సర్వే ప్రక్రియ సజావుగా నిర్వహించాలి
రఘునాథపల్లి, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక మొబైల్ యాప్ ద్వారా సజావుగా నిర్వహించాలని జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. గురువారం జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని నిడిగొండ, శ్రీమన్నారాయణ పురం గ్రామాలలో నిర్వహిస్తున్న మొబైల్ యాప్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజాపాలనలో దరఖాస్తులు చేసుకున్న లబ్ధిదారుల వివరాలను సర్వేయర్లు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ, మొబైల్ యాప్ ద్వారా ఆన్ లైన్ లో నమోదు చేసే విధానాన్ని కలెక్టర్ పర్యవేక్షించారు.
కలెక్టర్ స్వయంగా దరఖాస్తుదారుల ఇళ్లను సందర్శించి, వివరాలను అడిగి తెలుసుకున్నారు. రఘునాథపల్లి మండలంలో ప్రజా పాలనలో ఇందిరమ్మ ఇండ్ల కోసం 80 వేల దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ప్రతి గ్రామానికి గ్రామ కార్యదర్శిని సర్వేయర్ గా నియమించినట్లు తెలిపారు. ఆన్‌లైన్ లో వివరాలు ఎంట్రీ చేసేటప్పుడు కార్యదర్శి తప్పనిసరిగా లబ్ధిదారుని ఇంటికి వెళ్లి స్వయంగా పరిశీలించి ఎంటర్ చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్, తహసీల్దార్ మొహ్సిన్, పంచాయతీ కార్యదర్శి, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.