జనగామ అర్బన్/ బచ్చన్నపేట/ మొగుళ్లపల్లి/ నల్లబెల్లి/ పర్వతగిరి, వెలుగు: అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తామని ఉన్నతాధికారులు తెలిపారు. ఆదివారం ఉమ్మడి జిల్లాలో నిర్వహిస్తున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల సర్వే ప్రక్రియను వారు పరిశీలించారు. జనగామ జిల్లాలోని శామీర్‌పేట, పసరమడ్ల, మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డులో, బచ్చన్నపేట, నర్మెట్ట మండలాల్లో కొనసాగుతున్న సర్వేను కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పరిశీలించి, వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మొగుళ్లపల్లి మండలంలో సర్వే విధానాన్ని కలెక్టర్ రాహుల్ శర్మ తనిఖీ చేశారు. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం తిమ్మంపేట గ్రామంలో ఆఫీసర్లు చేపడుతున్న సర్వేను కలెక్టర్ సత్యశారదాదేవి తనిఖీ చేశారు. నల్లబెల్లి మండలం నందిగామ, రంగాపురంలో అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి సర్వేను పరిశీలించారు. అలాగే, పర్వతగిరి ఎంపీడీవో ఆఫీస్‌లో ఏడుగురు బృందాల సభ్యులతో రివ్యూ నిర్వహించారు. పర్వతగిరి మండలం దౌలత్ నగర్లో డీపీవో కల్పన సర్వేను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్వేను త్వరగా పూర్తి చేసి, గ్రామాల్లో గ్రామ సభలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.