జనగామ అర్బన్, వెలుగు : ఈ నెల 29న రాష్ట్ర గవర్నర్ జనగామ జిల్లా పర్యటనకు ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో అడిషనల్ కలెక్టర్ పింకేశ్ కుమార్, డీసీపీ రాజ మహేంద్ర నాయక్ తో కలిసి రివ్యూ మీటింగ్ నిర్వహించారు. 29న తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జనగామ జిల్లా పర్యటనకు రానున్నట్లు తెలిపారు.
ఈ నేపథ్యంలో రోడ్లను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఫాగింగ్ చేయాలని, ప్రోటోకాల్ ప్రకారం రూట్ మ్యాప్ తయారు చేయాలని ఫ్లెక్సీలు రూపొందించాలని, జిల్లా అభివృద్ధి, సంక్షేమంపై నోట్స్ సమర్పించాలని, స్యయం సహాయక సంఘాలు, పెంబర్తి హస్తకళలపై కలెక్టరేట్లో స్టాల్ ఏర్పాటు చేయాలని, అంబులెన్స్ అందుబాటులో ఉంచాలని, అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని, ఐడీ కార్డులు తప్పనిసరిగా ఉండాలని, అందుకు తగిన ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించాలని వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. ఈ రివ్యూలో ఆర్డీవోలు కొమురయ్య, వెంకన్న, జడ్పీ సీఈఓ సరిత, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.