జనగామ అర్బన్, వెలుగు: బాలికల భద్రతకు భరోసా అందించాలని, బాలికా సాధికారికత క్లబ్‌లతో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని జనగామ కలెక్టర్ రిజ్వన్ బాషా షేక్ అన్నారు. బాలికా, శిశు సాధికారత క్లబ్‌ల ఏర్పాటుపై బుధవారం కలెక్టరేట్లో సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యాశాఖ, పోలీస్‌శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి బాలికలకు ఎదుగుదలతోపాటు వచ్చే ఆరోగ్య సమస్యలు, వ్యక్తిగత పరిశుభ్రత, జీవన నైపుణ్యంపై ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో వైద్యుల సహకారంతో అవగాహన కల్పించాలనవ్నారు. 100, 1098, 181 వంటి టోల్ ఫ్రీ నంబర్లను పాఠశాలలో ప్రదర్శించాలన్నారు. సమావేశంలో డీసీపీ రాజమహేంద్ర నాయక్, జీసీడీవో గౌసియా బేగం, డీఎంహెచ్‌వో, డీడబ్బ్యూవో తదితరులు పాల్గొన్నారు.
సెక్యూరిటీ డిపాజిట్లను సమర్పించాలి
జనగామ అర్బన్, వెలుగు: రైస్‌మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేయాలంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం కచ్చితంగా బ్యాంకు గ్యారంటీ లేదా సెక్యూరిటీ డిపాజిట్ ను సమర్పించాలని జనగామ కలెక్టర్ రిజ్వాన్‌బాషా షేక్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్లో ధాన్యం కొనుగోళ్లపై మిల్లర్లతో మీటింగ్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జీవో 27 ప్రకారం 10 శాతం బ్యాంకు గ్యారంటీ, లేదంటే సెక్యూరిటీ డిపాజిట్ ను సమర్పించినట్లయితే ధాన్యాన్ని కేటాయిస్తామని పేర్కొన్నారు. పది రోజుల లోపు బ్యాంకు, సెక్యూరిటీ డిపాజిట్ ను సమర్పించాలన్నారు. సమావేశంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ రోహిత్ సింగ్, డీసీపీ రాజమహేంద్ర నాయక్, డీసీఎస్వో, డీఎం, రైస్ మిల్లుల యాజమాన్యం తదితరులున్నారు.