
- జనగామను అగ్రభాగాన నిలబెడతా
- సంక్షేమ పథకాల అమలులో నెంబర్‌వన్
- హస్టల్ నిద్ర, వరుస తనిఖీలతో హడల్
జనగామ, వెలుగు: పాలనలో జనగామ కలెక్టర్‌ది ప్రత్యేక ముద్ర. నిత్యం డెవలప్మెంట్పై ఫోకస్, సంక్షేమ పథకాల అమలులో క్షేత్రస్థాయిలో వెళ్లేలా కృషి చేస్తుంటారు. విద్య, వైద్యాన్ని గాడిలో పెడుతూ, ఆస్పత్రులు, హస్టళ్ల తనిఖీలు చేస్తూ, పని చేయని వారికి షోకాజ్ నోటీసులు ఇస్తూ హడలెత్తిస్తున్నారు. జనగామ జిల్లాలో ఏడాది పాలన పూర్తి చేసుకుని అభివృద్ధిలో తనదైన మార్క్ చూపిస్తున్న కలెక్టర్ రిజ్వాన్ బాషా ‘వెలుగు’తో శుక్రవారం ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు.
వెలుగు : యేడాది పాలన పూర్తైంది. జనగామ అభివృద్ధి ఎలా ఉంది ?
కలెక్టర్: పాలనలో ప్రత్యేకత కోసం కమిట్మెంట్తో పనిచేస్తున్నం. ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలను అమలు చేయడంతో జిల్లాను ముందు వరుసలో ఉంచుతున్నం. కుల గణన సర్వేనే ఇందుకు నిదర్శనం. ఇందిరమ్మ ఇండ్ల సర్వేను వేగంగా చేసినం. రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోళ్లు నిర్వహించాం. సంక్షేమ పథకాలను పేదల దరికి చేర్చేందుకు సమన్వయంతో ముందుకు సాగుతున్నం.
వెలుగు : ప్రధానంగా దృష్టి సారించిన అంశాలు ఏమిటి ?
కలెక్టర్ : అన్ని శాఖలపై దృష్టి పెడుతూనే విద్య, వైద్యం పై ఫోకస్పెట్టాం. ఈ రెండు విషయాలపై చేసే పని ఎక్కువ సంతృప్తిని ఇస్తుంది. ఉద్యోగుల్లో జవాబుదారీ తనం పెంచేందుకు తనిఖీలు ముమ్మరం చేశాం. నిర్లక్ష్యం చేసేవారికి షోకాజ్‌నోటీసులు ఇచ్చి హెచ్చరిస్తున్నాం. క్యాడర్ స్ట్రెంత్ లేకున్నా ఎక్కడా ఇబ్బందులు లేకుండా సీహెచ్‌సీ, పీహెచ్సీ డాక్టర్ల సమన్వయంతో పేషంట్లకు సేవలు అందిస్తున్నం.
వెలుగు : విద్యాభివృద్ధిపై ఎలాంటి దృష్టి పెట్టారు ?
కలెక్టర్ : మా దృష్టికి వచ్చే అన్ని సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్నం. ఇటీవల పూర్తి చేసిన నేషనల్అచీవ్మెంట్సర్వే. సర్కారు స్టూడెంట్స్ప్రతిభను వెలికి తీసేందుకు ఈ సర్వే చేపట్టినం. పది ఫలితాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి 100 శాతం ఉత్తీర్ణత లక్ష్యంగా పెట్టుకున్నం. అన్ని సబ్జెక్టుల్లో పట్టు సాధించేందుకు సర్కారు అభ్యాస దీపికను అందుబాటులోకి తెస్తే జనగామలో విజయోస్తును కూడా తీసుకువచ్చినం. తద్వారా లాంగ్వేజీలలోనూ పట్టు వస్తుంది. ప్రతీ నెల ఎంఈఓలు, స్కూల్ కాంప్లెక్స్హెచ్ఎంలతో రివ్యూలు పెట్టి అలర్ట్చేస్తున్నం. ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ విద్య ఉండేలా పనిచేస్తున్నం.
అమ్మ ఆదర్శ పాఠశాలల పనులు 85 శాతం పూర్తి అయ్యాయి. ఎంసీహెచ్ సమీపంలో రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్నిర్మాణానికి 20 ఎకరాలు కేటాయించాం. స్టేషన్‌ఘన్‌పూర్ కు ఇది మంజూరు కాగా, పాలకుర్తి, జనగామ లలో ఏర్పాటు కోసం ప్రపోజల్స్పంపించాం. అదేవిధంగా కేంద్రీయ విశ్వవిద్యాలయానికి కూడా 5 ఎకరాలు స్థలం కేటాయించి ప్రతిపాదనలు పంపించాం. వర్కింగ్ఉమెన్హాస్టల్ మంజూరు కాగా దీనికి కలెక్టరేట్ ఆవరణలోనే స్థలం కేటాయించాం.
వెలుగు : ఇటీవల చేపట్టిన హాస్టల్, గురుకులాల నిద్రలో ఎటువంటి సమస్యలు మీ దృష్టికి వచ్చాయి?
కలెక్టర్ : సర్కారు విద్యను మరింత పటిష్టం చేయాలని ఒకే రోజు నాతోపాటు, జిల్లా ఆఫీసర్లను రంగంలోకి దింపి హాస్టల్స్, గురుకులాల్లో రాత్రి బస చేశాం. అన్నింటిలోనూ వసతులు బాగానే ఉన్నాయి. స్టూడెంట్లకు ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు చేపట్టాలని ఆఫీసర్లను ఆదేశించాం. స్టూడెంట్లతో ఇంటరాక్ట్ అయి వారిలోని సృజనాత్మకత పెంపుకు సూచనలు ఇచ్చాం.
వెలుగు : జిల్లాలో సంక్షేమ పథకాల అమలు ఎలా ఉంది?
కలెక్టర్: అర్హులకు సంక్షేమ పథకాలు అందేలా పనిచేస్తున్నం. కోడ్ముగిసిన తదుపరి ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వంటి పథకాలను పకడ్బందీగా అమలు చేస్తాం. ధరణి విషయంలో కొత్తగా వచ్చిన టైంలో సుమారు 200ల మంది వరకు బాధితులు వచ్చేవారు. వారి సమస్య ఎక్కడుందనేది చెప్పుకుంటూ వచ్చాం. ప్రజల్లో భూ సమస్యలపై అవగాహన కల్పించినం. ఇప్పుడు ఆ సమస్యలు చాలా తగ్గాయి. ఎవరికి అన్యాయం జరిగినా గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేస్తే పరిష్కరిస్తున్నాం.
వెలుగు : జిల్లా కేంద్రం అభివృద్ధికి ఏం చర్యలు తీసుకుంటున్నారు?
కలెక్టర్: జిల్లా కేంద్రం లుక్ కోసం ప్రధాన జంక్షన్లను డెవలప్ చేస్తున్నాం. ఆర్టీసీ చౌరస్తా, కోర్టు చౌరస్తా, రైల్వే స్టేషన్ కూడళ్లను సుందరీకరిస్తాం. ఆహ్లాదకర వాతావరణం కోసం పార్కుల అభివృద్ధి పై దృష్టిపెట్టాం. సూర్యాపేట రోడ్డులోని బతుకమ్మ కుంటను డెవలప్ చేయాలన్న ప్రపోజల్స్ఉన్నాయి. ఎలక్షన్ కోడ్ముగియగానే ఆర్డీవో ఆఫీస్ వద్ద ఉన్న పార్కును అభివృద్ధి చేస్తం. హైదరాబాద్‌నుంచి జనగామ జిల్లా కేంద్రంలోకి (హైవే నుంచి సర్వీస్ రోడ్డు) వచ్చే చోట ఆర్చ్నిర్మాణం చేయాలని నిర్ణయించాం. దయానిలయం సమీపంలోని మోడల్‌మార్కెట్ పూర్తి కోసం మరో రెండు కోట్ల నిధులు అవసరమున్నయ్. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. ఆక్రమణలపై కఠినంగా వ్యవహరిస్తం. రంగప్ప చెరువు ఆక్రమణ ఆరోపణల పై రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల జాయింట్సర్వే కొనసాగుతుంది.
వెలుగు : వచ్చేది వేసవిలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
కలెక్టర్ : వచ్చే రెండు మూడు నెలలు అత్యంత కీలకం. పరీక్షల కాలం. సాగు, తాగునీటి కొరత లేకుండా అధికారులను అప్రమత్తం చేసినం. రైతులకు నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకుంటున్నం. వచ్చే ధాన్యం కొనుగోళ్ల సీజన్ పైనా దృష్టి పెట్టాం. జిల్లా యంత్రాంగం అంతా సమన్వయంతో పనిచేసేలా చర్యలు
తీసుకుంటున్నం.