నల్గొండ అర్బన్, వెలుగు : జిల్లాలో పోలీసులు, ఎఫ్‌ఎస్‌టీ, సర్వెలెన్స్ టీమ్ తనిఖీల్లో పట్టుబడ్డ రూ.4.84 కోట్లను రిలీజ్ చేశామని కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్ తెలిపారు. శనివారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పట్టుబడ్డ డబ్బులు, వస్తువుల తిరిగి ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన జిల్లా గ్రీవెన్స్ కమిటీ.. సరైన ఆధారాలు సమర్పించిన వారికి రూ. 10 లక్షల లోపు ఉంటే 24 గంటలలోపు , రూ. 10 లక్షలకన్నా ఎక్కువ ఉంటే వాణిజ్య పన్నుల శాఖ, ఇన్‌కం టాక్స్ శాఖకు సమాచారం ఇచ్చి క్లియరెన్స్ రాగానే విడుదల చేస్తుందని చెప్పారు.
జిల్లాలో ఈ నెల 12 నుంచి ఇప్పటి వరకు 179 కేసుల్లో 32 .94 కోట్లు పట్టుబడగా.. 150 కేసులు క్లియర్ చేసి 4 .85 లక్షలు, వస్తువులు రిలీజ్ చేసినట్లు తెలిపారు. ఇంకా 29 కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఈ నెల 20 న చిట్యాలలో పట్టుబడిన రూ. 26 .98 కోట్ల విలువైన బంగారం, వెండికి వాణిజ్య శాఖ క్లియరెన్స్ ఇచ్చింది, ఐటీ శాఖ నుంచి క్లియరెన్స్ రావాల్సి ఉందన్నారు. అనంతరం అకౌంటింగ్ టీమ్, సహాయ వ్యయ పరీశీలకులు, వీఎస్‌టీ, వీవీటీ టీమ్‌తో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ... అభ్యర్థుల ఎన్నికల ఖర్చును పక్కాగా నమోదు చేయాలని సూచించారు.
ర్యాలీలు, బహిరంగ సభలు, సమావేశాలు, రోడ్ షోలు వీడియో సర్వేయలెన్స్ టీమ్ పరిశీలించి అకౌంటింగ్ టీమ్‌కు అందించాలని ఆదేశించారు. టారిఫ్ రేట్ ప్రకారం వీటి ఖర్చులను షాడో అబ్జర్వేషన్ రిజిస్టర్ లో నమోదు చేయాలని తెలిపారు. ఈ సమావేశంలోఅడిషనల్ కలెక్టర్లు హేమంత్ కేశవ్ పాటిల్, శ్రీనివాస్, జిల్లా వ్యయ పర్యవేక్షణ కమిటీ నోడల్ అధికారి అర్.కిరణ్ కుమార్, జడ్పీ సీఈవో ప్రేమ్ కరణ్ రెడ్డి పాల్గొన్నారు.